సాలూరు: ప్రతి ఇంట్లో ఒక మహిళా వ్యాపారవేత్త ఉడాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యారాణి చెప్పారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యాన ప్లంబింగ్, విద్యుత్ వైరింగ్, బ్యూటీషియన్, టివి, ఎసి మెకానిక్ వంటి సర్వీస్ ప్రొవైడర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని, వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచనతో సర్వీస్ ప్రొవైడర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా సంఘాలనేవి సిఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికలన్నారు. మూడు నెలల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు శిక్షణ కోసం మెప్మా యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన మంత్రి సంక్రాంతి పండగ సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి సంబరాలను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. అంతకుముందు మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించారు. అనంతరం భోగి మంటలకు నిప్పు పెట్టారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్లు వి.హర్షవర్ధన్, కె.వరలక్ష్మీ, వైదేహి, పట్టణ నాయకులు కొనిసి చిన్ని, బాలాజీ పాల్గొన్నారు.