పార్వతీపురం టౌన్: స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కనే గల మున్సిపల్ వాణిజ్య సముదాయంలోని దుకాణాలను వ్యాపారం కోసం లీజుకు తీసుకున్న వారిలో ఇద్దరు, ముగ్గురు తప్ప చాలా మంది వ్యాపారం చేయడం లేదు. అందులో ఎక్కువ మంది బినామీదారులే ఉండడం విశేషం. అయితే ఈ బినామీదారులు అద్దెలను మున్సిపాలిటీ నిర్దేశించిన అద్దెల కన్నా ఎక్కువ మొత్తంలో లీజుదారులకు చెల్లిస్తున్నారు. అయితే లీజుదారులు ప్రతి నెలా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన అద్దెలు చెల్లించకుండా లక్షల్లో బకాయిలు ఉండడం మరో విశేషం. దుకాణాల అద్దెలు లక్షల్లో పేరుకుపోతున్నప్పటికీ, మున్సిపల్ రెవెన్యూ అధికారులు అద్దెల వసూళ్లకు, బకాయి పడ్డ దుకాణాలపై చర్యలు తీసుకోకపోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి నెహ్రూ మార్కెట్ పేరుతో ఉన్న పాత సముదాయాన్ని తొలగించి, ఈ నూతన సముదాయాలను 2006లో అప్పటి పాలకవర్గం రూ.56లక్షల నిధులతో ఐడిఎస్‌ఎంటి సముదాయం 50 దుకాణాలను నిర్మించి అద్దెప్రాతి పదికన కేటాయించారు. ఈ సముదాయాల నుంచి ప్రతి నెలా అద్దె రూపంలో రూ.3లక్షల 50 వేలు చొప్పున ఏడాదికి రూ.36 లక్షల 60 వేలు మున్సిపల్ కార్యాలయానికి ఆదాయ రూపంలో వస్తోంది. పట్టణ. ప్రధాన రహదారి, పాత బస్టాండు, కూరగాయల మార్కెట్, చేపలు గొర్రెల దుకాణాలు, మున్సిపల్ కార్యాలయం, పక్క పక్కనే ఉండడంతో అప్పట్లో ప్రజా ప్రతినిధుల బంధువులు, వ్యాపార అనుభవం లేనివారు పోటీపడి దుకాణాలను దక్కించుకున్నారు. అయితే షాపులను దక్కించుకున్న వెంటనే వేరే బినామీ వ్యాపారాలకు ఎక్కువ అద్దె ప్రాతిపదికన ఇచ్చి లబ్ధి పొందుతున్నారు తప్ప మున్సిపల్ కార్యాలయానికి ప్రతి నెలా చెల్లించాల్సిన అద్దె చెల్లించకుండా లక్షల్లో బకాయి పడడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, బకాయిలతో కలిపి ఇప్పటివరకు రూ.63 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటికీ రూ.35 లక్షలు మాత్రమే వసూళ్లు కావడం గమనార్హం. ఇంత పెద్ద మొత్తంలో అద్దె బకాయి ఉండడంపై మున్సిపల్ ఉన్నతాధికారులు మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ వాణిజ్యసముదాయంలో ఉన్న షాపులను లీజుకు తీసుకున్న వ్యాపారులు చెల్లించాల్సిన లక్షలాది రూపాయల అద్దెలు వసూళ్లు చేసే దిశగా మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దష్టిపెట్టేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యతగా ఎంతైనా ఉంది.
