అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లకుమినహాయింపు ఇవ్వాలి

Nov 27,2024 21:30

ప్రజాశక్తి-పార్వతీపురం : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులను డిఎస్‌సి నుంచి మినహాయించి, ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఐటిడిఎ కార్యాలయం వద్ద గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. బుధవారం ఈ దీక్షా శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ వి.ఇందిర, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయుల న్యాయబద్ధమైన డిమాండ్లు ఆమోదించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజు, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ మద్దతుగా దీక్షల్లో కూర్చున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కామేష్‌, ఉమామహేశ్వరావు, గంగరాజు, హరిబాబు, షర్మిల, బిందుమాధవి, ఉషారాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట : గిరిజన గురుకుల అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు ఐటిడిఎ గేటు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం కొనసాగుతున్నాయి. అవుట్‌ సోర్చింగ్‌ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఉపాధక్షులు ఒబాయోగి అన్నారు ఈ శిబిరానికి సంఘీభావం ప్రకటించారు.ఉపాధ్యాయులు లేకుండా చదువు సాగేదెలా?పార్వతీపురం : గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు నిరసన చేపడుతుంటే చదువులెలా సాగుతాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.రాజు ప్రశ్నించారు. ఈ మేరకు ఐటిడిఎ ఎపిఒ మురళిని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలిసి వినతి అందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వారం రోజులుగా అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు దీక్షలు చేస్తున్నారని, కనీసం ఉన్నతాధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొందని చెప్పారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఈరోజు ఐటిడిఎ ఎదుట దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులను సిఆర్‌టిలుగా నియమించాలని, వారి సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి.అఖిల్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.డేవిడ్‌ సాయి, తదితరులు పాల్గొన్నారు.

➡️