ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ చెదురుమదురుగా చినుకులు కురుస్తున్నాయి. దీంతో వరి కోతలు పూర్తి చేసుకుని పంటను ఇంటికి ఏ విధంగా సురక్షితంగా చేర్చుకోవాలో తెలియక రైతులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే నూర్పులు పూర్తి చేసి ధాన్యాన్ని బస్తాలకెత్తిన రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు పరుగులు తీస్తున్నారు. రైతుల ఇబ్బందులు గమనించిన ప్రభుత్వ అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టారు. నిబంధనలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వాహనానికి జిపిఎస్ పరికరం కచ్చితంగా ఉండాలన్న ఇబ్బందులను సడలించారు. మిల్లులకు రోజువారి కేటాయింపులతో సంబంధం లేకుండా తరలించుకునేలా అనుమతులు ఇవ్వడంతో ధాన్యం తరలింపు ప్రక్రియ జోరందుకుంది. బ్యాంకు గ్యారంటీల సమర్పణలో మొండికేసిన మిల్లర్లను అధికారులు నయానో భయానో దారికి తీసుకొచ్చుకొని 93 మిల్లులకు గాను 60 మిల్లుల నుంచి రూ.20 కోట్ల విలువచేసే బ్యాంకు గ్యారంటీలను వసూలు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2వేల మంది రైతుల నుంచి 13 వేల టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించినట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం వాతావరణంలో పూర్తిగా మార్పులు సంభవించి చినుకులు కురిశాయి. 15 మండలాల్లోనూ 51.6 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా జిల్లా సరాసరి 3.4 మిల్లీమీటర్లుగా నమోదయింది. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తడిచిపోయిన ధాన్యాన్ని నిబంధనలను మినహాయించి కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం ఉపాధ్యక్షులు బంటు దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శోభికకు వినతి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలను కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ తేమ శాతం అధికంగా ఉందన్న నెపంతో తుఫాన్‌కు తడిచిన ధాన్యాన్ని సేకరణకు అడ్డు తగులుతున్నారని అన్నారు. కావున తేమ శాతాన్ని మినహాయించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని జెసి కోరారు. ఇందుకు జెసి సానుకూలంగా స్పందించారని తెలిపారు.వీరఘట్టం : తుపాను ప్రభావంతో మండలంలో కురుస్తున్న జల్లులకు పంటను కోసిన అన్నదాతలు ఎక్కడికక్కడే వరి కుప్పలు వేసుకున్నారు. చిన్నపాటి చినుకులు పడడంతో పంటను కాపాడుకునేందుకు కుప్పల పైన టార్పినులు కప్పి వేశారు.మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో…వీరఘట్టం 3.6, సీతంపేట 4.4, భామిని 3.6 , పాలకొండ 3.6, కొమరాడ 2.2, గుమ్మలక్ష్మీపురం 2.6, కురుపాం, 4.2 జిఎం వలస , 2.0 గరుగుబిల్లి 1.4, పార్వతీపురం 6.8 మక్కువ 3.4, సీతానగరం 6.8, బలిజిపేట 1.8, సాలూరు 2.4 పాచిపెంట 2.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.