పట్టణానికి పండగ శోభ

Jan 11,2025 21:11

పార్వతీపురం టౌన్‌: పట్టణానికి సంక్రాంతి పండగ శోభ వచ్చింది. పట్టణ ప్రధాన రహదారి శనివారం కొనుగోలు, అమ్మకందారులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాల కోసం దూర ప్రాంతంలో ఉండే వారు తమ స్వగ్రామాలకు వస్తున్న సందర్భంలో పట్టణంలో గల రైల్వే స్టేషన్‌, బస్‌ కాంప్లెక్స్లలో ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. పండగకు కావాల్సిన కొత్త బట్టలు, కిరాణా సామాన్లు, మహిళల అలంకరణ సామాన్లు కొనుగోలు కోసం పరిసర గ్రామాల ప్రజలు భారీగా పట్టణానికి తరలివచ్చారు. దీంతో ఆయా దుకాణ సముదాయాలు కిటకిటలాడాయి. ప్రధాన రహదారితో పాటు పలు ప్రాంతాలు రద్దీగా ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌ పోలీసులు ముందస్తుగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. ఇదిలా ఉండగా గతేడాది కంటే ఈ ఏడాది నిత్యవసర వస్తువులు, ఇతర వస్తుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో ప్రజలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.

➡️