దొంగలు పడ్డ ఏడాదికి…

Feb 3,2025 21:27

పార్వతీపురం: స్థానిక ఐటిడిఎ పరిధిలో వైసిపి ప్రభుత్వ హయాంలో సిఆర్‌టిల రెగ్యులరైజేషన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు విచారణ చేపట్టడం దొంగలు పడిన ఏడాదికి ఐటిడిఎ అధికారులు స్పందించినట్లు కనిపిస్తోంది. సోమవారం స్థానిక ఐటిడిఎ కార్యాలయం లో ఎపిఒ మురళీధర్‌ సిఆర్టీలను విచారించారు. 133 మందిలో సోమవారం సగం మందిని, మంగళవారం సగం మందిని విచారణ చేపట్టనున్నారు. 2024 ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటిడిఎల పరిధిలో గల సిఆర్టీలను రెగ్యులర్‌ చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో జరిగిన సిఆర్టీల రెగ్యులరైజేషన్‌కు ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. సిఆర్టీలలో ఉన్న నాయకులే అందరి నుంచి డబ్బులు వసూలు చేసిన అప్పటి గిరిజన సంక్షేమ డిడి రుక్మాంగదయ్య, కార్యాలయం సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డికి చేరాయనే ప్రచారం జరిగింది. సరిగ్గా ఎన్నికల ముందు ఈ రెగ్యులరైజేషన్‌ జరగడంతో అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8నెలలు కావస్తోంది. ఇప్పుడు విచారణ చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డిడి రుక్మాంగదయ్యని కొద్ది నెలల క్రితం సరెండర్‌ చేశారు. వసూళ్ల పర్వంలో అసలు సూత్రధారి అయిన ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డిని ఆలస్యంగా పాడేరుకు డెప్యుటేషన్‌పై బదిలీ చేశారు. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారంలో సిఆర్టీలను విచారణ జరపడం వల్ల వాస్తవాలు వెలుగులోకి రావనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులలకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడానికే తప్ప ఈ విచారణ వల్ల ఉపయోగం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిఆర్టీల నాయకుల ఫోన్‌ పే నెంబర్లు తనిఖీ చేయకుండా మొక్కుబడి విచారణ చేయడం వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని మరుగున పెట్టి దొంగలు పడిన ఏడాది తర్వాత ఐటిడిఎ అధికారులు స్పందించడం హాస్యాస్పద మవుతోంది.

➡️