ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచిత విద్యుత్‌ కొనసాగించాలి

Feb 18,2025 21:51

ప్రజాశక్తి – పాలకొండ: పేదలకు ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రభుత్వం విద్యుత్‌ విద్యుత్‌ పథకాన్ని కొనసాగించాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమాణారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక విద్యుత్‌శాఖ సబ్‌డివిజన్‌ కార్యాలయం వద్ద కెవిపిఎస్‌, సిఐటియు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఉచిత కరెంటు ఇచ్చి, ఇప్పుడు వేలకు వేలు రూపాయలు చెల్లించమనడం ఎంతవరకు సమజంసమని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు మింగేసి మోడీతో కలిసి పేద ప్రజలను దోపిడీ చేస్తావా బాబు? అంటూ నిలదీశారు. ఎస్‌సి, ఎస్‌టి కుటుంబానికి 200 యూనిట్ల వరకుఉచితంగా విద్యుత్‌ ఇచ్చిందని, ఇప్పుడు ఐదేళ్లు మొత్తం వేలాది రూపాయలు కట్టమనడం దుర్మార్గమైన చర్యలు అని అన్నారు. ఇంత పెద్దమొత్తంలో బిల్లులు చెల్లించలేని వారి ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం అమానుషమన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్‌కొనసాగించాలని, ఇప్పటికే వసూళ్లు చేసిన డబ్బులను ఆయా కుటుంబాలకు వాపస్‌ చేయాలని, విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన కుటుంబాలకు తక్షణమే పునరుద్ధరించాలని, విద్యుత్‌ భారాలు మోపే విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యుత్‌శాఖ డిఇకి వినతిని అందజేశారు. దీనికి ఆయన స్పందిస్తూ 200 యూనిట్ల లోపల ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్తు కొనసాగిస్తామని, తప్పుడు బిల్లులు ఏమైనా వస్తే సరి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కాదా రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు, విద్యుత్‌ వినియోగదారులు టి.పార్వతి, కె.ఆదినారాయణ, కె.స్వాతి, టి.స్వాతి, కె.సిరి, హెచ్‌.శ్రీను, జి.సత్యం, పాలకొండ, ఎన్‌కె రాజపురం గ్రామాలకు చెందిన దళిత మహిళలు పాల్గొన్నారు.

➡️