ఇరుకైన గదిలో విధులు

Oct 27,2024 21:44

ప్రజాశక్తి -వీరఘట్టం : వీరఘట్టంకు ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం అంత అంతే.. పేరుకే మేజర్‌ పంచాయతీ తప్ప కనీస సౌకర్యాలు లేకపోవడంతో సచివాలయాల ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థలో భాగంగా ఉద్యోగులు పనిచేసేందుకు భవన నిర్మాణాలు పనులు చేపట్టారు. ఒక్కొక్క భవనానికి రూ.40 లక్షలతో ఉపాధి హామీ నిధులు వెచ్చించి పంచాయతీరాజ్‌ పర్యవేక్షణలో పనులు జరిగాయి. ఇందులో భాగంగా వీరఘట్టంకు మూడు సచివాలయ భవనాలు మంజూరయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదార్లు భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో పాత పంచాయతీ కార్యాలయంలోనూ ఈ మూడు సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒకే భవనంలో 1,2,3, సచివాలయాలు కొనసాగించడంతో అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అద్దె చెల్లించలేక సొంత కొంపకే మూడు సచివాలయాలు ఒక చోటు ఉన్నందున ఉద్యోగులు, అర్జీదారులు ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా 3,4సచివాలయాలను బిఎంఆర్‌ థియేటర్‌ సమీపంలోని ఓ అద్దె గృహంలో కొంతకాలం విధులు కొనసాగించారు. అద్దెలు కట్టుకోలేక మళ్లీ అక్కడి నుంచి ఇక్కడ సొంత భవనాలకు సామగ్రిని తీసుకువచ్చారు. అప్పట్లో సచివాలయాల ఏర్పాటు ఇందుకు సంబంధించిన సామాగ్రిని కూడా పంపిణీ చేశారు. కూడు లేదు గురువా అంటే చారు వేయు అన్న చందంగా ఉద్యోగులు విధులు నిర్వహించేందుకే సరైన భవన లేకపోగా, దీనితోడు ప్రభుత్వం మంజూరు చేసిన సామాగ్రిని ఎక్కడ ఉంచాలో అర్ధంకాని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. అవసరమైన సామాగ్రిని ఉంచుకుని మిగిలిన సామాగ్రినంతా వేరే చోట భద్రం చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కొన్న సామాగ్రిని భద్రపర్చడానికి స్థలం లేకపోవడంతో అవి ఎండకు ఎండి వానకు తడిసి తుప్పు పడుతున్నాయి. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని ఒక విధంగా చెప్పాలి.అర్ధాంతరంగా నిలిచిపోయిన భవన నిర్మాణాలుప్రారంభమైన సచివాలయ భవన నిర్మాణాలు బిల్లులు మంజూరు కాక ఫిల్లర్లు, శ్లాబ్‌లకే పరిమితమయ్యాయి. రెండో సచివాలయం భవనం పనులు ప్లాస్టింగులకు పరిమితమైంది. గత ఐదేళ్లలో సచివాలయ భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదంటే గత ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో వీటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా అర్ధాంతరంగా నిలిచిపోయిన సచివాలయ భవనాలు నిర్మాణ పనులు పూర్తి చేస్తుందా? లేక అసంపూర్తిగా నిలిపి వేస్తుందా? వేచి చూడాల్సి ఉంది. అర్ధాంతంగా విడిచిపెడితే లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన అర్ధాంతరంగా నిలిచిపోయిన భవన నిర్మాణాలను పూర్తి చేసి, సచివాయ ఉద్యోగులు సజావుగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఎపిఒ జి.సత్యం నాయుడు వద్ద ‘ప్రజాశక్తి’ ప్రస్తవించగా 80శాతం భవన నిర్మాణం పనులు పూర్తయితే వాటికి బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయని, అసంపూర్తిగా ఉన్న భవనాలకు ఏ విధమైన ఆదేశాలు రాలేదని వివరణ ఇచ్చారు.

➡️