పట్టణాభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి

Mar 11,2025 21:17

ప్రజాశక్తి – సాలూరు: ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు నిధులు కేటాయించాలని, తద్వారానే పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీలవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.గంగు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజల సమస్యలపై అధ్యయన యాత్రలో భాగంగా సాలూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఎం ప్రతినిధి బృందం పర్యటించింది. మక్కువ రోడ్‌లోని రైల్వే కాలనీ పేదల నివాసాల వద్ద ప్రజలుదేశించి గంగునాయుడు మాట్లాడారు. సాలూరు పట్టణంలో రైతు బజారు నిర్మాణం పూర్తయినా పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ వాడుకలోకి రాలేదన్నారు. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నప్పుడల్లా ప్రజలు దోపిడీ గురవుతున్నారని చెప్పారు. పట్టణంలో ప్రధానంగా కాలువలు, మరుగు నీటి వ్యవస్థ పూర్తిస్థాయిలో లేదని చెప్పారు. దండిగా రోడ్డు, బంగారంపేట, కోట సెంటర్‌ ప్రాంతాల్లో మరుగునీటి కాలువలు మెరుగుకు సరిపడే నిధులను పాలకవర్గం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మక్కువ రోడ్‌లోని పేదల నివాసాలకు పన్నులు వేసి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో ప్రభుత్వ ఐటిఐ, లైబ్రరీ అద్దె భవనాల్లో ఉంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. సిపిఎం నికరంగా ప్రజాసమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య యాత్రలో గుర్తించిన సమస్యలపై ఆందోళన నిర్వహిస్తామని, ఇందుకు ప్రజలంతా సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం సాలూరు పట్టణ కార్యదర్శి ఎన్‌వై నాయుడు, పాచిపెంట మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు, సాలూరు పట్టణ సిపిఎం నాయకులు టి.ఈశ్వరరావు, భాస్కరరావు, మనోజ్‌, భారతి ప్రజలు పాల్గొన్నారు.

➡️