పార్వతీపురం: జిసిసి యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ వి.మహేంద్రకుమార్ చెప్పారు. శనివారం ఆయన ‘ప్రజాశక్తి’తో మాట్లాడుతూ జిల్లాలోని అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యం రూ.12 కోట్లని, ఇంత వరకు రూ.6 కోట్ల లావాదేవీలు నడిపినట్లు చెప్పారు. నిత్యవసర వస్తువులు, పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీ, సూపర్ బజార్‌ల్లో వ్యాపార లక్ష్యం రూ.62 కోట్లు కాగా, ఇంతవరకు రూ.42 కోట్లు సాధించినట్లు తెలిపారు. చింతపండుతో సహా ఇతర అటవీ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు చెప్పారు. చింతపండు కిలో ధర రూ.34 పెంచినట్లు చెప్పారు. పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో చింతపండు దిగుబడి ఎక్కువగా ఉన్నందున నాణ్యమైన చింతపండు కొనుగోలు చేయాలని సేల్స్ మాన్లను ఆదేశించామని చెప్పారు. అడవి తేనె, కుంకుడు, షికాయ, నరమామిడి చెక్క వంటి ఇతర అటవీ ఉత్పత్తులకు ధరలు పెంచినట్లు చెప్పారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను జిసిసి డిపోల్లో విక్రయించాలని కోరారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నాణ్యమైన సరుకులు తీసుకొచ్చి నిర్దేశించిన ధరలు పొందాలని కోరారు. కొన్ని అటవీ ఉత్పత్తులకు విలువ ఆధారిత వస్తువులుగా తయారు చేసినట్లు తెలిపారు. ఉసిరి పొడి, షీకాయ, త్రిఫల రసాలను విలువ ఆధారిత వస్తువులుగా విక్రయిస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ చెప్పారు.