ప్రజాశక్తి – కొమరాడ : మహాకవి గురజాడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐద్వా నాయకులు వి.ఇందిర పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలో గురజాడ వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరని అలాగే గొప్ప హేతువాదని తెలిపారు. కన్యాశుల్కం వంటి నాటకాలు రచించిన అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల స్కూల్ హెచ్‌ఎం, సిబ్బంది, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి ఉన్నారు.పార్వతీపురం టౌన్ : కార్మిక ఉద్యమ, పోరాటాలకు గురజాడ అప్పారావు చరిత్ర ఆదర్శంగా నిలుస్తుందని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ అన్నారు. గురజాడ వర్థంతి సందర్భంగా స్థానిక బెలగాం మెయిన్ రోడ్లో గల గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని కొనియాడారు. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడని, అటువంటి మహా ఉద్యమ నేత స్ఫూర్తితో నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు పాకల సన్యాసిరావు, బి.సూరిబాబు, ఎస్.ఉమామహేశ్వరరావు, పి.రాజశేఖర్, బలరాం, మహిళలు పాల్గొన్నారు.