పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలి

Dec 4,2024 22:03

 కొమరాడ : పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని పరశురాంపురం, చంద్రంపేట గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. పరశురాంపురం వెల్నెస్‌ కేంద్రంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఉపయోగించిన వ్యాక్సిన్‌ వయల్స్‌, వివిఎం స్థితి పరిశీలించారు. సకాలంలో పిల్లలకు టీకాలు వేస్తున్నారా అని టీకా కార్డుల్లో పరిశీలించారు. అనంతరం డాక్టర్‌ జగన్మోహన్‌ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల బరువు, ఎదుగుదల వివరాల రికార్డులు తనిఖీ చేశారు. తూనిక పరికరంతో పిల్లల బరువును పరిశీలించి రికార్డుల్లో నమోదు చేసిన నివేదికలతో సరిపోయినదీ, లేనిదీ గమనించారు. అంగన్వాడీ పిల్లల హెల్త్‌ స్క్రీనింగ్‌ ఏ మేరకు పూర్తి చేశారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో బరువు, పోషకాహారం లోపం గుర్తిస్తే ఎన్‌ఆర్సి కేంద్రంలో చేర్చాలన్నారు. పుట్టుక,ఎదుగుదల లోపాలు, దృష్టి, వినికిడి, స్పీచ్‌, ప్రతిభ లోపాలను గుర్తిస్తే డిఇఐసికి రిఫర్‌ చేయాలన్నారు. సీజనల్‌గా ప్రబలే శ్వాససంబంధిత రుగ్మతలు, జ్వరం, దగ్గు, లింఫ్‌ గ్రంధులవాపు, కామెర్ల లక్షణాలు గుర్తిస్తే జాప్యం చేయక సత్వరమే తగు చికిత్స అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రంలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు చేతులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఆవశ్యకమని అన్నారు. వైద్య, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. చేయాలన్నారు. అనంతరం గ్రామంలో తాగు నీటి స్వచ్చతా పరీక్షలు చేయించారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ జయగౌడ్‌, వైద్య సిబ్బంది లత, ప్రమీల, రామకృష్ణ, అంగన్వాడీ సిబ్బంది సావిత్రి,అనురాధ,ఆశ, సిహెచ్‌.డబ్ల్యూలు పాల్గొన్నారు.

➡️