ప్రజాశక్తి – పాలకొండ : కూటమి ప్రభుత్వ హయాంలో కొత్తగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక అమల్లోకి వచ్చింది. దీంతో సామాన్యులు ఆనందం చెందారు. అయితే ఇసుకసురులు ఉచిత ఇసుక విధానాన్ని తుంగలోకి తొక్కి అక్రమంగా భారీస్థాయిలో తరలిస్తున్నారు. నాగావల్లి నది తీరం నుంచి ఇసుకను దర్జాగా దోచుకుంటున్నారు. నాగావళి నది తీరాన గల గోపాలపురం నుంచి రోజుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ట్రాక్టర్ ద్వారా లోడుకు రూ.1500 వరకు ధర పలుకుతుంది. లారీ లోడుకైతే రూ.8వేల నుంచి రూ.10వేలు వరకు ధర పలుకుతుంది. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇసుక దందాకు అధికార పార్టీ తెరతీసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపాలపురంలో పట్టపగలే అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. దీన్ని చూసిన వారంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. గోపాలపురం నుంచి రోజుకు వందలాది వాహనాలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు ఇసుక రవాణా జరుగుతుంది. ఉచిత ఇసుక విధానం అమల్లో ఉన్నప్పటికీ కేవలం నాటుబల్లకే పరిమితమవుతుంది. మండల కేంద్రానికి అతి దగ్గరలో గోపాలపురం వద్ద వాహనాల నుంచి ఇసుక తరలించుకుంటున్నారు. రాత్రీ, పగళ్లన్న తేడా లేకుండా రవాణా జరుగుతుంది. మరోపక్క గోపాలపురం గ్రామస్తులు కూడా ఇసుక అక్రమ రవాణాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే విపత్తు సంభవిస్తాదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
