ప్రజాశక్తి – సాలూరురూరల్ : ప్రస్తుతం రోడ్లుపై అత్యధిక ప్రమాదాలు ద్విచక్ర వాహనదారుల నుంచి నమోదవుతున్నాయని, దీనికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని సాలూరు పట్టణం సిఐ అప్పలనాయుడు తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ దారణపై అవగాహన సదస్సును నీడ్ స్వచ్ఛంద సంస్థ, సెట్విజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భరంగా ఆయన మాట్లాడుతూ నేడు యువత ద్విచక్ర వాహనాలను రహదారులపై ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నడపడంతో చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జెవివిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ వాహనం కలిగిన ప్రతి యాజమాని తప్పకుండా లైసెన్స్, ఇన్సూరెన్స్, టాక్స్ చెల్లించి మైనరైన యువకులకు వాహనాలను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నీడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పి.వేణుగోపాలరావు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువగా తలకు గాయాలై చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుందన్నారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వీటన్నింటి నివారణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధన ప్రకారం నడుచుకోవాలని, అప్పుడే ప్రమాదాల నుండి బయటపడగలమని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు నీడ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.సీతానగరం: ద్విచక్ర వాహనా లపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు జరిగే సమయంలో ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చని ఎస్‌ఐ ఎం.రాజేష్ అన్నారు. స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేసి అనంతరం హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహన చోదకు లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ లంక శ్రీను, లక్ష్మణరావుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.