ప్రజాశక్తి – కొమరాడ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని కూనేరు రామభద్రపురం పిహెచ్‌సి వద్ద సిఐటియు ఆధ్వర్యాన ఆశా కార్యకర్తలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్లమ్మ, హైమా మాట్లాడుతూ మండలంలోని కొమరాడ, మాదలింగి, రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 110 మంది వరకు ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వీరిక పని భారం తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే టిఎ, డిఎ ఇవ్వాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ బెనిఫిట్స్ కల్పించాలని, ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిహెచ్‌ఒ బంగారుబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రామభద్రపురం పిహెచ్‌సి పరిధిలోని పనిచేస్తున్న ఆశా కార్యకర్తలంతా పాల్గొన్నారు.