గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోఅడ్డగోలు నియామకాలు

Nov 27,2024 21:22

ప్రజాశక్తి-పార్వతీపురం : ఐటిడిఎ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అడ్డుగోలు నియామకాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతే లక్ష్యంగా కొంతమంది ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమనే ఆశతో లంచాలు ఇవ్వడానికి నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో కొన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అటెండర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తూ కొన్ని ఏజెన్సీలు నియామక ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఏజెన్సీ సంస్థలు బ్రోకర్ల ద్వారా ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.కురుపాం మండలం జి.శివడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అటెండర్‌ను నియమిస్తూ చిల్డ్రన్స్‌ డెవలప్‌మెంట్‌ ఎడ్యుకేషనల్‌ చేంజింగ్‌ అసోసియేటర్‌ అనే సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ కార్యాలయం విజయవాడలో ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుమ్మలక్శ్మీపురం జిడబ్ల్యుటిపిఎం పాఠశాలలో కూడా వాలంటీర్‌ అటెండర్‌ పేరుతో శ్రీ ఎల్లమాంబ సర్వీస్‌ అనే సంస్థ ఉద్యోగ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సంస్థ విశాఖపట్నానికి చెందినదిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పది, ఇంటర్మీడియట్‌ చదివిన గిరిజన నిరుద్యోగ యువతే లక్ష్యంగా ముక్కూ మొహం తెలియని ఏజెన్సీలు ఉద్యోగాల వల విసురుతున్నాయి. ఈ బోగస్‌ ఉద్యోగ నియామక ఏజెన్సీలు తమ ఏజెంట్ల ద్వారా నిరుద్యోగ యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేస్తున్నాయి. ఒకవేళ థర్డ్‌ పార్టీ ఏజెన్సీ ద్వారా ఎలాంటి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం చేపట్టినా ఐటిడిఎ అధికారుల ద్వారా జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు చేపడుతున్న నియామకాల గురించి తమకేమీ తెలియదని ఐటిడిఎ అధికారులు చెబుతున్నారు.విచారణ చేపట్టాలి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగ యువతే లక్ష్యంగా కొన్ని సంస్థలు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. ఇప్పటికే కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో కొన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అటెండర్‌ ఉద్యోగాల భర్తీ చేపడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అక్రమ ఉద్యోగాల దందాపై జిల్లా కలెక్టర్‌, ఐటిడిఎ పిఒలు సమగ్ర విచారణ చేపట్టాలి. నియామక ఉత్తర్వులు జారీ చేసిన సంస్థలపై చర్యలు తీసుకోవాలి.- పి.రంజిత్‌కుమార్‌,గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

➡️