ప్రజాశక్తి – జియ్యమ్మవలస: రెండేళ్లుగా ఉద్యోగం చేయని వారికి జీతాలు ఎలా ఇస్తున్నారని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రశ్నించారు. మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే అధ్యక్షతన కమిటీ సభ్యులు మంతిని మురళి, రంగుముద్రి సింహాచలం, గొట్టిపల్లి రాణి, ఎంపిపి బొంగు సురేష్‌తో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించి గతంలో నిర్వహించిన రికార్డులను ఆమె పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణకు అయిన ఖర్చులు, సిబ్బంది వివరాలు, రోగులకు అందిస్తున్న ఆహారం, సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రెండేళ్లుగా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ధనంజయ సక్రమంగా విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యంతో ఉండగా అలాంటి వారికి జీతాలు ఎలా చెల్లిస్తున్నారని స్కాట్లాండ్ సెక్యూరిటీ సంస్థపై ఆమె మండిపడ్డారు. విధి నిర్వహణలో వైద్యులు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించి ఈ ఆసుపత్రికి మంచి పేరు తేవాలని వైద్యులను సూచించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ ఆసుపత్రిలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేక డెలివరీ కేసులు పార్వతిపురం, కురుపాం ఆసుపత్రులకు తరలించాల్సి వస్తుందని, ఎక్స్‌రే మిషన్ అవసరమని, రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అవసరమని ఆమెకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రభు తేజ, డాక్టర్ కృష్ణ చైతన్య, చంద్రవర్మ, డాక్టర్ రమ్య సిబ్బంది పాల్గొన్నారు.
