ప్రజాశక్తి – పార్వతీపురం: జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ దూకుడు పెంచారు. ఎన్నిసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో ఆయన కొరడా ఝుళిపించారు. జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఎక్కువ గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తరచూ మండల, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన దూకుడు పెంచి చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవిన్యూ శాఖలో సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మండల, డివిజన్ స్థాయి రెవిన్యూ అధికారుల తో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించి తగు సూచనలు చేస్తున్నా కిందస్థాయి లో సమస్యల పరిష్కారం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం రెవిన్యూ శాఖలో గ్రామస్థాయి అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా వుంటోంది. గ్రామ స్థాయిలో భూసమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన సమగ్ర సర్వే వల్ల సమస్యలు రెట్టింపయ్యాయి. రైతుల సాగులో ఉన్న భూమి విస్తీర్ణం కన్నా తక్కువ చూపడం, ఒకరి సర్వే నెంబర్లు ఇంకొకరి పేరున వన్ బి ఖాతాల్లో కనిపించడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదినెలలైంది. ఈ ప్రభుత్వం కూడా భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ సదస్సులు, గ్రామసభలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా వేలాది సమస్యలు అర్జీల రూపం లో అధికారులకు చేరాయి. రెవిన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి రీ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే గ్రామస్థాయిలో రీ సర్వే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. గ్రామస్థాయిలో తగిన సిబ్బంది లేకనో, మరే ఇతర కారణాల వల్ల నో రీ సర్వే కార్యక్రమం ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో జరగడం లేదు. గత ప్రభుత్వం హయాంలో మంజూరైన పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే రాళ్ళపై మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు తొలగించే పనులను ప్రస్తుత ప్రభుత్వం చేపడుతోంది. కానీ రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం పై దష్టి సారించడం లేదు. గత ప్రభుత్వంలో మాదిరిగానే సర్వే జరగని గ్రామాల్లో నూ సర్వే చేసినట్లు నివేదికలు పంపిన విధంగా ఇప్పుడు కూడా అధికారులు రీసర్వే కార్యక్రమాన్ని మొక్కుబడిగా భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ జిల్లాలో ఇద్దరు విఆర్వోలను సస్పెండ్ చేశారు. సాలూరు, సీతానగరం మండలాలకు చెందిన ఇద్దరు విఆర్‌ఒలపై పనితీరులో నిర్లక్ష్యం కారణంగా వేటు వేశారు. ప్రణాళికాబద్దంగా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి వున్నా ఆ విధంగా పని జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం రెవిన్యూ శాఖలో వేళ్ళూనుకుపోయిన అవినీతి. లంచం లేనిదే రెవిన్యూ శాఖలో ఏ పని కూడా జరిగే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కింద స్థాయి రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన అధికారులకు హెచ్చరిక సంకేతాలు పంపారు. అభివద్ధి పనుల విషయంలోనూ.. జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ కింద జరుగుతున్న పనుల్లో ఎక్కువగా సిసి రోడ్లు, కాలువలు, బిటి రోడ్డు నిర్మాణాలు వున్నాయి. ఈ పనులు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో చురుగ్గా జరుగుతున్నాయి. అయితే గిరిజన నియోజకవర్గమైన కురుపాంలో పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక సమీక్ష సమావేశాల్లో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు.పనులు వేగవంతం చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయన చర్యలకు ఉపక్రమించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో పల్లెపండగ పనులు నత్తనడకన జరుగుతున్న తీరుపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. మార్చిలోగా ఈ పనులు పూర్తి చేయాలని, లేకపోతే నిధులు వెనక్కి పోతాయని చెపుతున్నా చలనం లేదు. దీంతో ఆయన పనులు ప్రారంభం కాని మండలాల ఇంజినీర్లను సస్పెండ్ చేయాలని తొలుత ఆదేశించారు. తర్వాత షోకాజ్ నోటీసులు జారీకి పరిమితమయ్యారు. పల్లె పండగ పనులు వేగవంతం కావాలంటే స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి కింద స్థాయి నాయకులతో చేయించాలి. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నా కురుపాం నియోజకవర్గంలో నెమ్మదిగా జరుగుతుండడంపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. నిర్లక్ష్యం నిద్రలో ఉన్న జిల్లా యంత్రాంగంలో మార్పు తీసుకురావడానికి కలెక్టర్ దూకుడు ఏ మేరకు పని చేస్తుందో వేచి చూడాల్సిందే.
