ఇంటర్‌ ఫలితాలో మన్యం జిల్లా ప్రభంజనం సత్తా చాటిన

Apr 12,2025 21:39

పార్వతీపురం రూరల్‌ : గత నెల మార్చిలో జరిగిన ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అద్వితీయ ప్రతిభను కనబర్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ ప్రథవ,ు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, అన్ని మేనేజ్మెంట్‌ కళాశాలల ఫలితాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో ఆరో స్థానం, ద్వితీయ సంవత్సరం ఏడో స్థానంలో నిలిచి జిల్లా పేరును పతాక స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా ఇంటర్‌ మీడియట్‌ విద్యాధికారిని మంజులవాణి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో ప్రథమ ఇంటర్‌కు 8315 విద్యార్థుల హాజరు కాగా, 6582 విద్యార్థులు ఉత్తీర్ణులై 79శాతం ఫలితాలు సాధించగా, ద్వితీయ సంవత్సరం 8318 విద్యార్థులకు గాను సెవెన్‌ జీరో సిక్స్‌ ఫైవ్‌ విద్యార్థులు ఉత్తీర్ణులై 84.9శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందని ఆమె తెలిపారు. అలాగే జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 1937 విద్యార్థులకు గాను 1349 విద్యార్థులు పాస్‌ కాగా, ద్వితీయ సంవత్సరం 1605 విద్యార్థులకు గాను 1294 విద్యార్థులు ఉత్తీర్ణులై 80.6శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసి, రాష్ట్రంలోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఫలితాల్లో ప్రథమ స్థానంలో జిల్లాను నిలిపారని ఆమె తెలిపారు. అలాగే ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఎక్కువ అవకాశం కల్పించిన ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ, కళాశాలలతో పాటు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులై జిల్లాను రాష్ట్రస్థాయిలో ఆరు, ఏడు స్థానాల్లో నిలిపారని అన్నారు. ఇంతటి విజయానికి కారణం కలెక్టర్‌తో పాటు, అధికారులు ఇచ్చిన ప్రోత్సాహం, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్మెంట్‌కు సంబంధించిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కృషి కూడా ఉందని ఆమె తెలిపారు. కలెక్టర్‌ అభినందనలు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో మొదటి, సెకెండ్‌ ఇయర్‌ జనరల్‌ విభాగంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని మేనేజిమెంట్లకు సంబంధించి మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో జిల్లాకు ఆరు, ద్వితీయ సంవత్సరంలో ఏడో స్థానం రావడం పట్ల ఇంటర్‌ అధికారులను కలెక్టర్‌ అభినందించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంత మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి కలెక్టర్‌ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సం.రంలో కూడా మంచి ప్రతిభను కనబరచి, ఉత్తమ ఫలితాలను సాధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. డిఐఇఒకు అభినందనలుజిల్లాలో గల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంతో పాటుగా, ఓవరాల్‌ గా రాష్ట్రస్థాయిలో ఇంటర్‌ ఫలితాలలో జిల్లాను 6,7 స్థానాల్లో నిలిపినందుకు గానూ డిఐఇఒ డి మంజుల వాణికి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జయరామారావుతో పాటు అధ్యాపకులు తెర్లి రవికుమార్‌ శ్యామలరావు,శర్మ ప్రసాద్‌, సత్యనారాయణ, లక్ష్మణరావు, శ్రీధర్‌, రవి ప్రసాద్‌, రామకష్ణ, సోమేశ్వరరావు, రవి, తదితరులు పుష్పగుచ్చాలతో సాలువ కప్పి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా ఫస్ట్‌ రాకేష్‌, వేణు పాచిపెంట : ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జరిగిన పరీక్షల్లో మండలంలోని పి.కోనవలస ఎపి ప్రభుత్వ గిరిజన బాలుర సంక్షేమ కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లాకి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరానికి చెందిన బంటి రాకేష్‌ ఎంపిసిలో 979 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్‌గా నిలిచాడు. అలాగే ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరానికి గానూ గేమ్మెల వేణు హెచ్‌ఇసిలో 493 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జిల్లాలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న ఇరువురి విద్యార్థులను అధ్యాపకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదువుతూ జిల్లా ప్రథమ స్థానం పొందడం సంతోషం వ్యక్తం చేశారు.

➡️