ప్రజాశక్తి – సాలూరురూరల్ : మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యారాణికి మున్సిపల్ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇపిఎఫ్, పిఎఫ్ అమలులో లోపాలను సరిచేయాలని సాధారణ, ప్రమాద సమయంలో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియో ఇవ్వాల, అప్కొస్ ద్వారా రిటైర్మెంట్ అయిన వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలనీ, పర్మినెంట్ ఉద్యోగులకు సరెండర్ లివులు, డిఎ బకాయిలు చెల్లించాలని, క్లాప్ వర్కర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని, సమ్మె కాలానికి జీతాలను ఇవ్వాలని, పండుగ కానుక వెయ్యి రూపాయిలు ను ఇవ్వాలని, విజయవాడ వరదల సమయంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న సిబ్బందికి అదనంగా ఒక నెల జీతం ఇవ్వాలని, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని, సుప్రీం కోర్టు సూచనల మేరకు కమిటీలను ఏర్పాటు చేయాలి, అందులో మహిళలకు చోటు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ సాలూరు మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు టి.రాముడు, టి.శంకర్రావు, నాయకులు లక్ష్మి, రాము, గోవింద, సోములు, రామలక్ష్మి, బాజి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురం టౌన్ : మున్సిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ బోనుల గౌరీశ్వరి ఇంటికి వెళ్లి ఆమెకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్థానిక సమస్యలు, చట్టబద్ధమైన సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. కార్మికులపై రోజురోజుకు పని భారం పెరుగుతుందని, దొడ్డిదారిన అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో పనులు చేయించుకుం టుందని అన్నారు. పాలకులు ఎంతమంది మారినా మున్సిపల్ కార్మికుల జీవితాలు మారడం లేదన్నారు. కావున మీరు ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఈనెల 28న (సోమవారం) మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, ఎన్. శంకర్రావు, ఎన్.మల్లేశ్వరరావు, ఎం.శివ, సిహెచ్ సింహాచలం, విజయ, లక్ష్మణరావు, ఆర్.తిరుపతి రావు, ఇ.కుమార్, తదితరులు పాల్గొన్నారు.