దళితుల భూఆక్రమణపై విచారణ తప్పా?

Apr 16,2025 21:34

ప్రజాశక్తి-సాలూరు: పాచిపెంట మండలం మోసూరు సర్పంచ్‌ దళితుల భూములను ఆక్రమించారని ఫిర్యాదు వస్తే విచారణ చేపట్టడం తప్పెలా అవుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మోసూరు సర్పంచ్‌ దళితుడైనంత మాత్రాన దళితులకు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించడం తప్పు కాదన్నారు. సర్పంచ్‌ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని చెప్పారు. దీనిపై విచారణ జరిపితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కరాసువలస కస్తూరిబా పాఠశాలని తాను ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఓ విద్యార్థిని కడుపు కాలిపోతోందని చెప్పినట్లు తెలిపారు. విద్యార్థినుల ఆకలి తీర్చే విధంగా భోజనం పెట్టకపోతే విచారణ జరిపించాలని ఆదేశించానని చెప్పారు. వారిలో 50మందికి పైగా గిరిజన విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విచారణ జరిపించాలని ఆదేశిస్తే తప్పు ఎలా అవుతుందని అన్నారు. ఇలాంటి తప్పులు రాజారెడ్డి రాజ్యాంగంలో సాధ్యమవుతుందేమో కానీ అంబేద్కర్‌ రాజ్యాంగంలో సాధ్యం కాదన్నారు. మున్ముందు కూడా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేస్తానని, తప్పు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను మంత్రిగా ఏ అధికారినీ నాలుగైదు గంటలు నిరీక్షించేలా చేయలేదని మాజీ మంత్రి రాజన్నదొరని ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. తిరుపతి దర్శనం టిక్కెట్లు అమ్ముకునే అలవాటు తనకు మాజీ మంత్రి పుష్పశ్రీవాణిని ఉద్దేశించి మాట్లాడారు. వైసిపి అబద్ధపు ప్రచారాలతో ప్రజల్ని గందరగోళంలో పెట్టాలని చూస్తోందని, మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తిరుమలలో గోవుల హత్య జరిగిందని అసత్య ప్రచారం చేయడం దారుణమని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు నిమ్మాది తిరుపతిరావు, గుల్ల వేణుగోపాల్‌ నాయుడు, ఆముదాల పరమేష్‌, ఎఎంసి చైర్మన్‌ ముఖి సూర్యనారాయణ పాల్గొన్నారు.

➡️