భూమి కోసం, భుక్తి కోసం ఈ ప్రాంతంలో ప్రతి దిక్కూ నినదిస్తోంది. ఆ నినాదాలకు పేరు పెడితే.. ఆ నాటి త్యాగాలను స్మరిస్తే.. అప్పుడు జాలువారిన కన్నీటిని, చిందించిన నెత్తుటిని గుర్తిస్తే.. మొత్తంగా ఆ అలజడికి అక్షర రూపం ఇస్తే.. అదే గిరిజన రైతాంగ పోరాటం!! సిక్కోలులో 1960వ దశకంలో దిక్కులు పిక్కటిల్లేలా నేటికి సరిగ్గా 57 ఏళ్ల క్రితం ఇదే రోజున శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ ఉద్యమం విస్తృతమైంది.. క్రమంగా గిరిజనులకు పలు హక్కులు సంక్రమించాయి. గురువారం కోరన్న, మంగన్న 57వ వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం…
ప్రజాశక్తి – కురుపాం : వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం… దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు వ్యతిరేకంగా 1967 అక్టోబర్ 31న కమ్యూనిస్టు పార్టీ మొండెంఖల్ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విద్యార్థులు, మహిళలు, గిరిజనులు పిల్లాపాపలతో సభకు వెళ్తున్నారు. ఈ బహిరంగ సభను భగం చేయాలని పలువురు భూస్వాములు పి.లేవిడి గ్రామం వద్ద ఆదివాసీలపై దాడులు చేశారు. ఆనాటి భూస్వాముల కాల్పుల్లో ఇద్దరు ఆదివాసీ యువకులు మరణించారు. వారే శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమం తొలి అమరవీరులు ఆరిక కోరన్న, కొండగొర్రె మంగన్న. విజయనగరం జిల్లాలోని కొంత ప్రాంతం ఆనాటి శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. ఇందులో అధిక శాతం భూమి జమీందారులు, సంస్థానాధీశుల ఆధీనంలో ఉండేది. ఆదివాసీలకు అక్షర జ్ఞానం లేక అంకెలు తెలియకపోవడంతో భూస్వాముల దోపిడీకి వరంగా మారింది. భూస్వాముల వెట్టిచాకిరి నుంచి గిరిజనులకు విముక్తి కల్పించడానికి పలు పోరాటాలు జరిగాయి. గిరిజనులను చైతన్య పరచడానికి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గిరిజన సంఘం ఏర్పాటు చేసి ఉద్యమాలకు ఊపిరి పోశారు. పల్లెరక రాములు, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితరులు ముందుండి ఉద్యమాలను నడిపించారు. 1971 వరకు వివిధ దశల్లో ఉద్యమాలు జరిగాయి. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం పోలీసు తూటాలకు బలైపోయారు. ఆరిక గుంపస్వామి, కొండగొర్రె లచ్చన్న, కృష్ణమూర్తి, శ్రీరాములు, వసంత, రఘు, రాములు తదితరులు జైలుపాలయ్యారు. ఆనాటి ఉద్యమకారుల త్యాగ ఫలంగానే ఐటిడిఎ, జిసిసి ఏర్పాటయ్యాయి. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం వచ్చింది. పోరాట ఫలితంగా గిరిజనులు సాధించుకున్న హక్కులను నేటి పాలకులు కాల రాయడానికి కుట్రలు చేస్తూనే ఉన్నారు. కేంద్రంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి అడవి తల్లి ఒడిలో బతుకుతున్న గిరిజనులను అక్కడి నుంచి వెళ్ల గొట్టేందుకు కుట్రలు పన్నింది. ఏజెన్సీలో ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగానే గిరిజన, రైతులకు జీవనాధారమైన బడిదేవరకొండపై గ్రానైట్ తవ్వకాలకు పాలకులు అనుమతులిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఉద్యోగావకాశాలు కల్పించే జిఒ నంబర్ 3ను రద్దు చేశారు. ఇలా ఎన్నో నిర్ణయాలను ఆదివాసీలకు వ్యతిరేకంగా చేశారు. వీటిపై సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యాన గిరిజనులు పోరాటాలు చేసి ఆ ప్రయత్నాలను కొంతమేర అడ్డుకున్నారు. యుపిఎ హయాంలో వామపక్షాల చొరవతో వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని నీరుగార్చే చర్యలకు ఒడిగట్టింది. అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు భూములపై హక్కులు లేకుండా చేయాలని చూస్తోంది.నీలకంఠాపురం పంచాయతీ మామిడిమానుగూడలో గురువారం శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట అమర వీరుల కోరన్న, మంగన్న 57వ వర్థంతి సభ నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోలక అవినాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు సిపిఎం సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు హాజరవుతారని తెలిపారు. గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.