ఈ సమావేశంలోనూ అదే తీరు..

Sep 30,2024 21:20

పార్వతీపురం టౌన్‌: సమావేశంలో అజెండాను సభ్యులు ఆమోదించకుండా సోమవారం జరిగిన సమావేశంలోనూ అదే తీరును కనబర్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బోనెల విజరు చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత రెండు నెలలుగా కౌన్సిల్‌ సమావేశం అజెండాలో పొందుపరిచిన అంశాలు మున్సిపల్‌ ఉద్యోగి చదివి వినిపిస్తుండగానే అజెండాను ఆమోదించకుండానే వైసిపి సభ్యులు వాకౌట్‌ చేయడం జరిగింది. అయితే సోమవారం కౌన్సిల్‌ సమావేశ ప్రారంభమైన వెంటనే, పాలకవర్గ వైసిపి పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు సమావేశం నుండి వెళ్లిపోయారు. ఈ విషయంపై వాకౌట్‌ చేసి సమావేశం నుండి వెళ్లిన కౌన్సిలర్లకు వివరణ కోరగా చైర్పర్సన్‌, కమిషనర్‌ తీరు నచ్చకే వెళ్ళిపోతున్నామని చెప్పడం విశేషం. అయితే మిగిలిన 8మంది అధికారం వైసిపి కౌన్సిలర్లతో పాటు ముగ్గురు వైసిపి కోఆప్షన్‌ సభ్యులు, టిడిపి సభ్యులు, ఇండిపెండెంట్‌ సభ్యుడితోనే సమావేశంలో 32 అంశాలతో కూడిన అజెండాను ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో వైసిపి, టిడిపి, ఇండిపెండెంట్‌ కౌన్సిల్‌ సభ్యులు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, పారిశుధ్య నిర్వహణతో పాటు, శ్మశానాల అభివృద్ధి, రోడ్లు, కాలువల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా మీమీ వార్డుల్లో సమస్యలు ఏమైనా ఉంటే చైర్పర్సన్‌ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దీంతో 7, 10, 26వార్డుల కౌన్సిలర్లు బొత్స ఆనంద్‌, పొట్లూరు దివ్య, బెలగాం కరుణ తమ వార్డుల్లో ఉన్న దీర్ఘకాల సమస్యలపై ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే టిట్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు డబ్బులు చెల్లించారని లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. 8,1వ వార్డు కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, రణభేరి శివకుమార్‌ మాట్లాడుతూ పట్టణంలో ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నాయని, అనధికార భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోకి వెళ్లేందుకు రహదారిని మూసి షాపులు నిర్మించడం జరిగిందని, ఆక్రమణ తొలగించాలని, షాపింగ్‌ కాంప్లెక్స్‌కు మరమ్మతులు చేపట్టాలని, ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. కొత్తవలసలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, అలాగే పట్టణానికి ప్రతిరోజు పలు గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు వసున్నారని, వారికి మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ, ఆక్రమణలు అనధికార భవన నిర్మాణాలపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకోవడంతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు., ప్రతినెలా జరిగే కౌన్సిల్‌ సమావేశానికి మున్సిపల్‌ అధికారులతో పాటు రెవెన్యూ, విద్యుత్‌ తదితర విభాగాల అధికారులు పక్కాగా హాజరయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, మేనేజర్‌ డి.లక్ష్మి, ఎఇ జి.ఆనంద్‌, రెవిన్యూ అధికారి రూబేను దిబ్బ, ప్రజారోగ్య అధికారి కె. పకీరు రాజు, ఆర్‌ఐలు ఈశ్వరరావు, వినరు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️