ప్రజాశక్తి – సీతంపేట: ఏజెన్సీలో అధికంగా కనిపించే అరుదైన వ్యాధుల్లో సికిల్ సెల్ ఎనీమియా ఒకటి. కొండలు కోనల్లో, శివారు ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనులకు కనీసం వ్యాధి ఉందని కూడా తెలియని పరిస్థితి. ఈ వ్యాధి బారినబడి కొంతమంది మృతి చెందారు. సికిల్‌సెల్ ఎనీమియా ఉన్నవారు కళ్లు తిరిగి పడిపోవడం, రక్తం రోజురోజుకూ తగ్గిపోవడం, నీరసించి పోవడం వంటి లక్షణాలతో తరచూ బాధపడుతుంటారు. ఈ వ్యాధి నిర్మూలనకు సరైన చికిత్సా విధానం లేకపోవడంతో అనేక మంది మృతువాతపడుతున్నారు. రోగుల పట్ల పిఒ ప్రత్యేక శ్రద్ధ సీతంపేట ఐటిడిఎ పరిధిలోని 20 మండలాల్లో పిఒ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గిరిజన గ్రామాలను సందర్శిచి, అక్కడి గిరిజం కష్టాలు తెలుసుకోవడంతో పాటు ఆసుపత్రిలో తనిఖీ చేయడం వంటివి చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో సికిల్‌సెల్ ఎనీమియాతో ఎక్కువ మంది గిరిజనులు బాధపడుతున్నట్టు గుర్తించారు. గిరిజనులు అసలే నిరుపేదలు. ఈ రోగులకు ప్రభుత్వం నెలకు రూ.10వేలు పెన్షన్ మంజూరు చేసిన్నట్టు కూడా తెలియదు. కొంతమందికి తెలిసినప్పటికీ ఐదేళ్లుగా విశాఖ కెజిహెచ్‌లో వైద్య పరీక్షలు చేసి ఇచ్చిన ధ్రువపత్రం కోసం కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ అందకపోవడంతో పెన్షన్లు రాని ఎంతో మంది సికిల్ సెల్ ఎనీమియా బాధితుల బాధలకు పిఒ చలించిపోయారు. దీంతో ఆయన ఒక అడుగు ముందుకేసి ఐటిడిఎ ఆధ్వర్యాన అన్ని గిరిజన గ్రామాలు, ఆశ్రమ పాఠశాలల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. 0 నుండి 40 ఏళ్లు గల లక్షా24 మందికి పరీక్షల్లో నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వ్యాధిగ్రస్తులకు 225 మందిని సీతంపేట వైటిసిలో విశాఖ కెజిహెచ్ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించి హెచ్‌పిఎల్‌సి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 110 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గుర్తించారు. వీరికి కెజిహెచ్ వైద్య బృందం ద్వారా ధ్రువపత్రాలు పిఒ దగ్గర ఉండి ఇప్పించారు. అంతేకాకుండా ఐటిడిఎ పరిధిలోని పిహెచ్‌సి వైద్యాధికారులకు సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్‌కు అవసరమయ్యే దరఖాస్తులను ఐటిడిఎకు సమర్పించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ దరఖాస్తులను పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల డిఎంహెచ్‌ఒ కార్యాలయాలకు పంపించి పరిశీలన చేయించి త్వరగా పింఛను మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కెజిహెచ్ హెచ్‌బిఎల్‌సి ధ్రువపత్రాల కోసం కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ అందని ధ్రువపత్రాలు పిఒ యశ్వంత్ కుమార్ రెడ్డి కృషితో రోగులకు రూ.10వేలు పెన్షన్లు అందడంతో వారు ఎంతో సంతోషపడుతున్నారు.సికిల్ సెల్ ఎనిమయా వ్యాధిగ్రస్తులకు పాజిటివ్ ధ్రువపత్రంఐటిడిఎ పరిధిలో గల అనేక మంది సికిల్ సెల్ ఎనీమయా వ్యాధిగ్రస్తులకు పాజిటివ్ ధ్రువపత్రం లేకపోవడంతో పింఛన్ అందడం లేదు. విశాఖ కెజిహెచ్‌కు వెళ్లి ధ్రువపత్రం చేయించుకోలేక చాలామంది పింఛన్‌కు కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కెజిహెచ్ ఆసుపత్రితో మాట్లాడి ఒక ప్రత్యేక బృందంతో సీతంపేట వైటిసిలో సికిల్ సెల్ ఎనిమియా హెచ్‌పిఎల్‌సి పరీక్ష నిర్వహించాం. ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారికి సంబంధిత పిహెచ్‌సి వైద్యాధికారులు ప్రభుత్వం మంజూరు చేసే పింఛన్ కావాల్సిన అర్హత పత్రాలు సమర్పించి ప్రతి నెలా పింఛన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం.సి యశ్వంత్ కుమార్ రెడ్డి,పిఒ సీతంపేట ఐటిడిఎ.
