ప్రజాశక్తి-మక్కువ : ప్రపంచీకరణ పుణ్యమా అని ఆస్తి కోసం పేగుబంధాన్ని కూడా దూరం చేసుకుంటున్న రోజులివి. కుమార్తె.. ఆడ పిల్ల కానీ, ఈడ పిల్ల కాదుగా.. అన్న ధోరణిలో పసుపు కుంకుమ కింద రాసిచ్చిన భూమిని సైతం లాక్కొనేందుకు అడ్డదారులు తొక్కాడో తండ్రి. అది కూడా తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు. కూతురికి తల్లి రాసిచ్చిన ఆస్తిని రికార్డులు మార్చి, కాజేయాలని పన్నాగం పన్నాడు. అందుకోసం రాజకీయ అండదండలతో భూమిని రికార్డులు మార్చి అన్యాక్రాంతానికి ఒడిగట్టాడు. దీనికి కుటుంబ బంధాలు, అనుబంధాలు భారంగా మారడం ఒకింత కారణమైతే, భూముల ధరలకు రెక్కలు రావడం తండ్రి అత్యాశకు మరో కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కన్నకూతురు తండ్రిపై బుధవారం స్థానిక తహశీల్దార్ షేక్ ఇబ్రహీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే…మక్కువ మండలంలోని కోన గ్రామానికి చెందిన శంకరాపు లక్ష్మణరావు కుమార్తె శోభ. ఆమెకు పాచిపెంట మండల కేంద్రానికి చెందిన వెంపటాపు సంతోష్‌కుమార్‌తో 2016లో వివాహమైంది. ఈ నేపథ్యంలో తాతయ్య వారసత్వంగా వచ్చిన ఆస్తిని శోభకు తల్లి పార్వతి రాసిచ్చింది. పసుపు – కుంకుమ కింద 2.10 ఎకరాల భూమిని 2022లో శోభ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. లక్ష్మణరావు.. శోభ తాత ఇంటికి ఇల్లరికపు అల్లుడిగా వచ్చాడు. శోభ పిన్నిని కూడా లక్ష్మణరావు అనధికారంగా వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం శోభకు ఇచ్చిన భూమిని ఇటీవల జరిగిన రీసర్వేలో లక్ష్మణరావు రాజకీయ అండదండలు ప్రదర్శించి, రికార్డులను తారుమారు చేసి కాజేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన శోభ.. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ స్పందించి భూమిని అప్పగించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఆమెకు నేటికీ అప్పగించలేదు. సిఐ సమక్షంలో ఇరువురిని పిలిచి, గొడవలు వద్దని చెప్పినా, భూమి వద్దకు వెళ్లిన వెంటనే కొట్టడానికి, చంపడానికి సిద్ధమవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యాన బాధిత మహిళ శోభ.. బుధవారం స్థానిక తహశీల్దార్ ఇబ్రహీమ్‌ను కలిసి, ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా తన భూమిని అప్పగించాలని, ఆ భూమి వద్దకు వారిని వెళ్లనీయకుండా చూడాలని ఆమె కోరారు. దీంతో తహశీల్దార్ స్పందిస్తూ వారం రోజుల్లో రికార్డు పరిశీలించి, సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, ఎపి రైతు సంఘం నాయకులు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.