ట్రాఫిక్‌ నిబంధనలు తెలుసుకోండి ప్రమాదాలను నివారించండి : కలెక్టర్‌

Jan 16,2025 20:29

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తెలుసుకుని ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా మాసొత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గోడపత్రికలు, కరపత్రాలను విడుదల చేశారు. జాతీయ రహదారుల సంస్థ (నేషనల్‌ హైవే అథారిటీ), రహదారుల మంత్రిత్వ శాఖ – రహదారులపై సురక్షిత ప్రయాణం (సడక్‌ సురక్ష అభియాన్‌) ప్రచారం – 2025లో భాగంగా ఫిబ్రవరి 15 వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా ప్రచార సామగ్రి, కరపత్రాలు, బ్రోచర్లతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు భద్రత అవగాహన కోసం వాలంటీర్లను గుర్తించి శిక్షణ ఇవ్వడం, వాహన డ్రైవర్లకు ఆరోగ్య తనిఖీ, కంటి పరీక్షలు నిర్వహణ, రోడ్డు భద్రత అమలు, అవగాహన కార్యకలాపాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎన్‌హెచ్‌, ఎస్‌హెచ్‌లో బ్లాక్‌ స్పాట్‌లను సరిదిద్దడానికి వ్యూహాన్ని సిద్ధం చేయడం, శిక్షణ పొందిన వాలంటీర్లు కళాశాల విద్యార్థులతో వాకథాన్‌ నిర్వహించడం, వివిధ కార్యక్రమాలు ద్వారా రోడ్డు ప్రమాదాలకు గల వివిధ కారణాల గురించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక, జిల్లా రవాణా అధికారి టి.దుర్గాప్రసాద్‌రెడ్డి, మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శశికుమార్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జి.సీతారాం, అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు జి.సత్యనారాయణ, ఎన్‌.రమేష్‌ కుమార్‌, బి.కాశీరాంనాయక్‌, మెడికల్‌ ఆఫీసర్‌ పి.నారాయణరావు, హౌంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️