లేబర్‌ కోడ్‌ను రద్దు చేయాలి

Feb 5,2025 21:24

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే నిరసనలో భాగంగా బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద, నాలుగు రోడ్ల కూడలి వద్ద కార్మికులు సిఐటియు, ఇప్టూ నిరసన, ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు, కోశాధికారి గొర్లె వెంకటరమణ, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు జి.సర్వేశ్వరరావు, సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు మాట్లాడారు. స్వాతంత్య్రం ముందు నుంచి కార్మకవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కోవిడ్‌ కాలంలో దుర్మార్గంగా పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరగకుండా 2019లో వేతనాలు కోడ్‌ను, 2020లో పారిశ్రామిక సంబంధాల సామాజిక భద్రత కోడ్‌లను ఆమోదించిందన్నారు. ఇంత కార్మిక వ్యతిరేకమైన ఈ చట్టాలు రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందాయన్నారు. దీంతో ఏ క్షణానైనా అమలు ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమావేశంలో కార్మిక నాయకుల సమక్షంలో ప్రకటించారని తెలిపారు. దీన్ని కార్మిక నాయకులంతా వ్యతిరేకించారని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చిందని తెలిపారు. కార్మిక హక్కులను కలరాసి పెట్టుబడులకు పెద్ద పీట వేయడానికి ఈ లేబర్‌ కోడ్లు వచ్చాయన్నారు. ఈ లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా పనిచేయించి దోపిడీని మరింత తీవ్రతరం చేయబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు సిఐటియు యావత్‌ కార్మిక వర్గాన్ని చైతన్యపర్చాలన్నారు. లేబర్‌ కోర్టుల వల్ల కార్మికులకు సంఘం పెట్టుకొనే హక్కు పోతుందన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించే సమయం పెరుగుతుందని, సమ్మె చేసే హక్కు నిర్వీర్యమవుతుందని తెలిపారు. ఏ హక్కు లేనప్పుడే కార్మికవర్గం పోరాడి హక్కులు సాధించింది. పోరాడిన హక్కులు లేకుండా చేస్తామంటే కార్మిక వర్గం కాళ్లు ముడుచుకొని కూర్చోరాదని, పోరాడి మన హక్కులను సాధించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, వర్తక సంఘం కళాసీలు రాగోలు, గేదెల రామారావు, సర్వేశ్వరరావు, చీపురుపల్లి సింహాచలం, నాగవంశం శంకర్రావు, సంతు, పాపులమ్మ, ఇప్పలమ్మ, శివ, ఎం సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌ ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ రైస్‌ మిల్లు సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు మాట్లాడుతూ లేబర్‌ కోడ్స్‌ వల్ల కార్మికుల ప్రాణాలకే భద్రత లేకుండా పోవడంతో పాటు పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌, కనీస వేతనాలు అమలు లాంటి ప్రాథమిక చట్టాల అమలు అధోగతి అయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాలరాసే ఏ ప్రభుత్వమైనా తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కాద రాము, రైస్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గేదెల సత్యం, కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.సీతానగరం : లేబర్‌ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా మండలంలోని నిడగల్లులో స్కీం వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సందర్భంగా శ్రామిక మహిళా నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, జి.జ్యోతి, వై.శాంతి కుమారి మాట్లాడారు. కార్మిక హక్కులు కాలరాసి పెట్టుబడులకు పెద్దపీట వేయడానికి లేబర్‌ కోడ్‌లు వచ్చాయన్నారు. లేబర్‌ కోడ్‌లు అమలుల్లోకి తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా పనిచేయించి దోపిడీని మరింత తీవ్రతరం చేయబోతుం దన్నారు. అందుకు సిఐటియు యావత్‌ కార్మిక వర్గాన్ని చైతన్యపర్చాలన్నారు. పోరాడి మన హక్కులను సాధించుకోవాల న్నారు. నిరసన కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి.జయలక్ష్మి, రాజమణి, అనసూయమ్మ, పుష్ప, మీనా, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : మండ లంలోని బంటువానివలస వద్ద విజయశంకర ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ (రైస్‌ మిల్‌) వద్ద పని ప్రదేశంలో యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. పోరాడి మన హక్కులను సాధించు కోవాలన్నారు. నిరసనలో యూనియన్‌ నాయకులు వి.శ్రీనివాసరావు, త్రినాధ, ఎ.సూర్యనారాయణ, బంటు శివన్నాయుడు కళాసీ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.కొమరాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్‌ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాంబమూర్తి, అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్‌ అనురాధ, ఆశా వర్కర్లు లీడర్‌ రాజేశ్వరి, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల నాయకులు లలిత మాట్లాడారు. కార్యక్రమంలో స్కీం వర్కర్లు పాల్గొన్నారు.

➡️