ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : పారిశుధ్యాన్ని పాటించి స్వచ్ఛ సమాజాన్ని ఏర్పాటు చేద్దామని కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ స్వచ్చ సుందర పార్వతీపురం, పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం దుష్ప్రభావాల నినాదాలతో సాగింది. ఆర్‌సిఎం వద్ద జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యం అత్యవస్యమన్నారు. పారిశుధ్యంతో ఆరోగ్యం ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. మంచి సమాజానికి పారిశుధ్యం తప్పనిసరని తద్వారా మంచి ఆరోగ్యం రావడం కాకుండా ఉత్పాదక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దేశంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలపాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు చేసుకోవడం పర్యావరణానికి మంచిదని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల జీవరాశుల మనుగడకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ స్వచ్చ సమాజం సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలన్నారు. పార్వతీపురం, సాలూరులో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు మంజూరు అయ్యాయని అన్నారు. స్వచ్చ ఆంధ్రా కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున రావు మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్చ ఆంధ్రా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలని ఆయన కోరారు. సంతలు వంటి ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలలో సామాజిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్వచ్చ సుందర పార్వతీపురం ప్రతిజ్ఞ ను నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.హేమలత, డ్వామా పీడీ కె.రామ చంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు, డిపిఒ టి.కొండలరావు, విజయనగరం, శ్రీకాకుళం జెడ్పీ డిప్యూటీ సిఇఒలు ఆర్‌వి రామన్, సత్యనారాయణ, డిఇఒ ఎన్.తిరుపతి నాయుడు, జిల్లా సహకార అధికారి పి శ్రీరామ మూర్తి, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి డా. టి కనకదుర్గ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎన్ కష్ణ వేణి, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ భాస్కర రావు, స్వచ్చ ఆంధ్రా కార్పొరేషన్ కన్సల్టెంట్ శ్రీనివాసన్, స్వచ్చ సుందర పార్వతీపురం ప్రతినిధి పద్మజ, పట్టణ ప్రముఖ వైద్యులు ద్వారపురెడ్డి రామ్మోహన్ రావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బడే నాగభూషణరావు, ఘన, ద్రవ వనరుల నిర్వహణ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు..
