ప్రజాశక్తి – పాచిపెంట : ఊరు బడిని రక్షించుకుందాం… పాఠశాలలను మూసివేయొద్దు అంటూ పాచిపెంటలో సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఎస్.రామారావు, కె.త్రినాధరావు ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను గురువారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం పేదలకు చదువు లేకుండా చేయడమేనని అన్నారు. నూతన విద్యా విధానం వల్ల డ్రాప్స్ పెరిగే ప్రమాదాన్ని ప్రజలకు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. విజయవంతంగా నడుస్తున్న ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసి 3,4,5 తరగతులను తరలించడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ప్రాథమిక విద్య పూర్తిగా బలహీన పడిపోయే ప్రమాదం ఉందని, ఈ పద్ధతి మార్చుకొని ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు, ఇంగ్లీష్ సమాంత మీడియంలో కొనసాగించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం చేయడం వల్ల పేదలకు విద్య లేకుండా మరింత అనాగరికంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున పాఠశాలలను మూసివేసే యోచనను ప్రభుత్వం మానుకోవాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.కొమరాడ : నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలలు మూసివేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ డంగభద్రలో నిర్వహిస్తున్న పాఠశాల వద్ద నుండి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి గురువారం ”ఊరు బడిని” రక్షించుకుందాం పేరిట సిపిఎం ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచార గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు స్కూళ్లను ఎత్తివేయమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. నూతన విద్యా విధానం వల్ల డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీంతో ప్రాథమిక విద్య పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలకు అసౌకర్యంగా ఉండే పద్ధతులు మార్చుకొని ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్‌ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లోని పాఠశాలలను కాపాడుకునేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపర్చి భవిష్యత్తులో ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డంగభద్రకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
