కేరళ వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలుద్దాం

Dec 11,2024 21:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కేరళ ప్రజలకు, వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలవాలని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేరళ వామపక్ష ప్రభుత్వానికి సంఘీభావంగా బుధవారం జిల్లా పరిషత్‌ మినిస్టీరియల్‌ భవనంలో సభ జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేరళలోని సిపిఎం నాయకత్వాన ఉన్న వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు,అడ్డంకులు కల్పిస్తోందని అన్నారు. కేరళపై కేంద్ర బిజెపి ప్రభుత్వం కక్షగట్టి లక్ష కోట్లకుపైగా రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వకుండా ఆ రాష్ట్ర అభివృద్ధిని అస్థిర పరిచేందుకు కుయుక్తులు పన్నుతోందన్నారు. చట్టపరంగా రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదన్నారు. దేశంలోనే అక్షరాస్యతలో అగ్రస్థానం, మహిళా సాధికారత, విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, స్ధానిక సంస్థలకు విధులు, నిధులు వికేంద్రీకరించి సుపరిపాలన అందించడంలో దేశంలోనే కేరళ అగ్ర స్థానంలో ఉందని అన్నారు. కేంద్ర బిజెపి గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ పాస్‌ చేసిన బిల్లులను తొక్కిపెడుతున్నారని అన్నారు. కేరళ రాష్ట్రంలో సహకార రంగాన్ని నాశనం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భారత పెట్రోలియం లాంటి భారీ పరిశ్రమలను అమ్మడానికి పూనుకున్న దన్నారు. త్రివేండ్రం విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించిందని, రాష్ట్రప్రభుత్వమే కొంటామన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి నిరాకరించిందని తెలిపారు. వయనాడ్‌ కొండ చరియలు విరిగిపడి నాలుగు వందల మంది మరణించారని, మరో వందమంది నేటికీ లభ్యం కాలేదని, తీవ్రమైన ఈ దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించలేదని అన్నారు. ఈ తీవ్రమైన కేంద్ర ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండించాలని కోరారు. సభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి. శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌. రాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహన్‌, వి. రాములు,యూ ఎస్‌ రవికుమార్‌, సి హెచ్‌. ప్రకాష్‌, కరీం, సత్యం, రాఘువ, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️