ప్రజాశక్తి పార్వతీపురం రూరల్ : జీవిత బీమా సంస్థలో (ఎల్‌ఐసి)లో 100శాతం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టడం భారత జీవిత భీమా సంస్థ ఉసురు తీయడమేనని స్థానిక ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం బేస్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు టెక్కలి ధర్మారావు, ఆర్ వి ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ దేశంలో గల అన్ని ఎల్‌ఐసి కార్యాలయాల వద్ద మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 1995లో చేపట్టిన జీవిత బీమా సంస్థల్లోకి విదేశీ పెట్టుబడుల ఆహ్వానం దశలవారీగా 2024నాటికి వందశాతం చేరుకుందని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసి ఆఫ్ ఇండియాను తెరమరుగు చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనబడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఈ సంస్థను పూర్తిగా కోలుకోలేని స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఉద్యోగులు, సంఘాలు ఊరుకోవని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించుకొని వెనుక్కు తీసుకోవాలని లేకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు ప్రారంభమవుతాయని అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు ఆదిత్య, వెంకటరమణ, కోటేష్, సూర్య, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
