సాలూరు/పాచిపెంట: నియోజకవర్గంలో దళిత, గిరిజనులే లక్ష్యంగా టిడిపి నాయకులు దాడులు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాచిపెంట మండలం మోసూరులో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ వైస్ ఎంపిపి గండిపిల్లి రాము అధ్యక్షతన నిర్వహించిన సభలో రాజన్నదొర మాట్లాడారు. నియోజకవర్గంలో గత ఏడాది కాలంగా మంత్రి సంధ్యారాణి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులే లక్ష్యంగా దాడులు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. అనేక మంది చిరుద్యోగులను తొలగించడం, దళిత అధికారులను బదిలీ పేరుతో వేధించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాచిపెంట మండలంలో 8మంది, మెంటాడ మండలంలో 8మంది చిరుద్యోగులను సస్పెండ్ చేయించారని చెప్పారు. వీరిలో ఎక్కువగా దళితులు, గిరిజనులు,బిసిలే వున్నారని అన్నారు. వైసిపికి చెందిన గిరిజన సర్పంచులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో సర్పంచ్‌లకు కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మండలంలో రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసిపి దళిత నాయకుడు గండి పిల్లి రాము 24ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను ఇప్పుడు సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అదే గ్రామంలో టిడిపి నాయకుడు చెరువును దర్జాగా కబ్జా చేస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ వల్లే మంత్రి అయిన నియోజకవర్గ ఎమ్మెల్యే సంధ్యారాణి పాలనలో దళిత, గిరిజనులపై వేధింపులు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి.చంటి, ఎంపిటిసి సభ్యులు కొల్లి లక్ష్మి, వైసిపి సీనియర్ నాయకులు దండి శ్రీనివాసరావు, పాచిపెంట చినబాబు, పిరిడి రామకృష్ణ, గిరిజన నాయకులు నెమలి పిట్ట కళ్యాణ్, పీడిక సుదర్శన్ రావు, నూకయ్య, సీతయ్య, కౌన్సిలర్ సింగారపు ఈశ్వరరావు, మాజీ కౌన్సిలర్ ఎం.అప్పారావు పాల్గొన్నారు.
