పాలకొండ : స్థానిక నగర పంచాయతీ చైర్‌పర్సన్ పీఠం చిక్కుముడి వీడ లేదు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో ఇప్పటి వరకూ చైర్మన్‌గా ఉన్న రాధా కుమారి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక సోమవారం జరిగింది. ఎస్సీ రిజర్వ్‌డ్ చెందిన వైసిపి తరఫున గెలిచిన రెండో వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరికి ఆ పదవి వరిస్తుందని అందరూ భావించారు. అయితే ఇటీవల ఆమె జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో నగర పంచాయతీలో తెలుగుదేశం జెండా ఎగురవేసేలా రాజకీయాలు మొదలుపెట్టారు. దీంతో ఎమ్మెల్యే జయకృష్ణ రంగంలోకి దిగి రాజకీయ పావులు కదిపారు. సోమవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. అయితే వైసిపి, కూటమి పార్టీల మధ్య చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. గంటకుపైగా జరిగిన చర్చల్లో నగర పంచాయతీలో చైర్మన్ ఎన్నికకు 18మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే హాజరయ్యారు. టిడిపికి చెందిన ముగ్గురు, జనసేనకు చెందిన కౌన్సిలర్, అలాగే తాజాగా టిడిపిలో చేరిన ఆకుల మల్లేశ్వరితో ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నారు. ఆకుల మల్లేశ్వరి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా చైర్మన్ పదవి పోటీ చేస్తానని ఎన్నికల అధికారులు ముందు చెప్పగా, సబ్ కలెక్టర్ అంగీకరించలేదు. వైసిపి తరఫున పార్టీ బి-ఫారం మీకు వచ్చిందని, కావున ఇండిపెండెంట్‌గా పరిగణంలోకి తీసుకోవడం జరగదని చెప్పారు. అలాగే వైసిపి కౌన్సిలర్లు వెలమల మన్మధరావు, దుప్పాడ పాపినాయుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే జయకష్ణ కలుగజేసుకొని రెండు పార్టీలకు ఇబ్బంది లేకుండా ఇండిపెండెంట్‌గా ఉంచుదామని కౌన్సిలర్లతో మాట్లాడారు. వైసిపి తరఫున గెలిచిన కౌన్సిలర్లే ఎక్కువ మంది ఉన్నారని, నగర పంచాయతీలో తమకు బలం ఉందని ఇక్కడ చైర్మన్‌ను ప్రకటించాక మీరు తీసుకువెళ్లి మీ పార్టీ కండువా వేసుకోండి అంటూ ఎమ్మెల్యేకు వైసిపి కౌన్సిలర్లు తేల్చి చెప్పారు. దీనికి ఎమ్మెల్యే సమ్మతించలేదు. మల్లేశ్వరి పోటీ నుంచి తప్పుకుంటున్నానని మళ్లీ ఎన్నికల అధికారి ముందు చెప్పగా సమావేశం వాయిదా వేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని సబ్ కలెక్టర్ చెప్పడంతో ఎమ్మెల్యే కొంత అసహనం చెందారు. అభ్యర్థి లేకుండా ఎన్నిక ఎలా చేసుకుంటారో చేసుకోండి అంటూ టిడిపి, జనసేన కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం మంగళవారం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పడాల భూదేవి, కూటమి నేతలు పాలకొండ చేరుకొని ఈ ఎన్నికపై దృష్టి పెట్టారు. దీంతో మంగళవారం ఎలాంటి పరిణా మాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.ఎమ్మెల్యే ప్రవర్తన సరికాదు : ఎమ్మెల్సీ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక విధానంలో ఎమ్మెల్యే అనుసరించిన విధానం సరికాదని ఎమ్మెల్సీ విక్రాంత్ దుయ్యబట్టారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల విధానంలో ఎమ్మెల్యే తీరు ఆక్షేపణ ఏమన్నారు. కౌన్సిల్లో వైసీపీకి బలం ఉండే తమ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరిని బి-ఫారం ఇచ్చి ప్రతిపాదిస్తే, ఆమె ఇటీవల టిడిపి కండువా కప్పుకున్నారని తెలిపారు. వైసిపి బి-ఫారంపై కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించడం ఆక్షేపణీయమ న్నారు. ఎమ్మెల్యే తన మొండితనంతో ఎన్నిక జరిపించి టిడిపికి వేయించాలని చూడటం చాలా మూర్ఖత్వం అన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కళావతి, వైసిపి నాయకులు ఉన్నారు.
