ప్రజాశక్తి – గరుగుబిల్లి : ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రకాల పంటలతోనే అనేక లాభాలు రైతులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ పి.షణ్ముఖరాజు అన్నారు. మండలంలోని నాగూరులో కేతిరెడ్డి వెంకటనాయుడు పొలంలో సాగు చేస్తున్న పలు పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏక పంట వేయడం వల్ల దిగుబడులు, భూసారం తగ్గి రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ తరుణంలో వరి పంట తర్వాత రబీ డ్రై సోయింగ్‌లో భాగంగా మినుముతో పాటు మొక్క జొన్న, కంది, బొబ్బర్లు, పెసలు, ఉలవలు సాగు చేయాలన్నారు. వీటివల్ల పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు. మిగతా పంటలకు కూడా అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. భూమి సారవంతం చెందడం, మొక్కల్లో జీవ వైవిధ్యం పెంపొందించడం, పురుగులు – తెగుళ్లు తట్టుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయని తెలిపారు. ఒక పంట తర్వాత మరో పంట రావడం జరుగుతుందని, ఏడాది పొడువునా పంటలు భూమిపై పండించడం వల్ల సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుందని, నిత్య పంటలు – నిత్య ఆదాయం లభించడంతో పాటు, పలు పంటల వల్ల రైతులకు, ప్రకృతికి పలు లాభాలు సంభవిస్తాయని తెలిపారు. అలాగే నువ్వులు వేసుకొనే రైతులు మూడు మీటర్లకు, ఒక వరుస చొప్పున కంది, లేదా బెండ, జొన్న , సజ్జ వేసుకొంటే మంచి ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అసోసియేట్ జి.అన్నపూర్ణ, మండల ఇన్చార్జి వి.పోలినాయుడు, వెంకటనాయుడు, గౌరునాయుడు, రైతులు జి.లక్ష్మి, జి.సింహచలం పాల్గొన్నారు.
