ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : జిల్లాలో మొక్కజొన్న సాగు చేసే రైతులు పెరిగి ఈ ఏడాది పంట చేతికి అందినా ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారని వెంటనే ప్రభుత్వం జిల్లాలో అన్ని మండలాల్లోనూ మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఎపి రైతు సంఘం ఉపాధ్యక్షులు బంటు దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా రెవెన్యూ అధికారి హేమలతను ఆమె కార్యాలయం కలిసి వినతి అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు. అనేక చీడపీడలకు తట్టుకొని మొక్కజొన్న పంటను పండించిన రైతు మార్కెట్ సదుపాయం లేక దిగాలు పడుతున్నారని, ఈ ఏడాది రబీ సీజన్ వరి పంట చేతికి అందొస్తున్న తరుణంలో మద్దతు ధరకు ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలో పేద రైతులను ప్రభుత్వం సకాలంలో ఆదుకోవాలని లేకపోతే పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం ఉపాధ్యక్షులు రెడ్డి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
