ఉచిత పేరిట మస్కా

Oct 3,2024 21:26

పార్వతీపురం: ఇసుక ఉచితమంటూ ప్రభుత్వ పెద్దలంతా ఊదరగొడుతున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్లినా ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చునని చెపుతున్నారు. ఎన్నికల ముందు టిడిపి కూటమి పార్టీలు హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని ప్రకటించాయి. అయితే ఆచరణలో మాత్రం ఉచిత ఇసుక విధానం కనిపించడం లేదు. జిల్లా వాసులకు ఇసుక కావాలంటే భామిని మండలంలోని కాట్రగెడ్డ రీచ్‌ నుంచి మాత్రమే తెచ్చుకోవాలని ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. భామిని కాట్రగెడ్డ రీచ్‌ నుంచి ఇసుక కావాలంటే ఆన్‌లైన్‌లో ముందుగా బుక్‌ చేసుకుని తెచ్చుకోవాలి. భామిని మండలం జిల్లాకు ఒక మూలన ఉంది. ఆ రీచ్‌ పాలకొండ నియోజకవర్గానికి కొంత మేర దగ్గరగా ఉంటుంది. కానీ మిగిలిన మూడు నియోజకవర్గాల్లో గల మండలాలకు ఆమడ దూరంలో ఉంది. సాలూరు నియోజకవర్గానికి ఇసుక తీసుకురావాలంటే భామిని మండలం నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం వుంటుంది. అక్కడ నుంచి ట్రాక్టర్‌లో ఇసుక రవాణా చేసుకోవడానికి అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుంది. పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న ఏ గ్రామానికి ఇసుక తరలించాలన్నా వంద కిలోమీటర్ల దూరం పైనే వుంటుంది. మరి ఉచిత ఇసుక ఎలా అవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని మండలాల్లోనూ రీచ్‌లను ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతం ఉన్న అన్ని చోట్లా ఇసుక రీచ్‌లను అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు మాత్రం జిల్లా అంతటికీ భామిని మండలం నుంచి ఇసుక తరలించు కోవాలని చెపుతోంది. దీని వెనుక కూటమి ప్రభుత్వ రహస్య వ్యూహమేదో దాగి వుందనే ప్రచారం జరుగుతోంది. గత మూడు నెలలుగా జిల్లాలో నిర్మాణరంగ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాక్టర్లల్లో పనిచేస్తున్న కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుందని గంపెడాశతో ఎదురు చూసిన బడుగు జీవులకు నిరాశే మిగులుతోంది. ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేద, మధ్యతరగతి ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్‌ యజమానులు, కూలీలు లబోదిబోమంటున్నారు.స్థానిక రీచ్‌ల్లో ఇసుక లేదాజిల్లాలో దాదాపు అన్ని మండలాల్లోనూ ఇసుక రీచ్‌ లున్నాయి. నాటుబళ్లతో ఇసుకను ఉచితంగానే తరలిస్తున్నారు. నాటుబళ్ళతో రవాణా చేసుకోవచ్చు కానీ ట్రాక్టర్లతో రవాణా చేయకూడదని, ఒకవేళ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు ఇసుక ఉచిత మంటూ గొప్పలు చెపుతుంటే అధికారులు మాత్రం ట్రాక్టర్లతో రవాణా చేస్తే చర్యలు వుంటాయని మెలిక పెడుతున్నారు. దీని వెనుక మతలబు ఏమిటో అర్థం కాక జనం తికమక పడుతున్నారు.నేడు కలెక్టరేట్‌ ఎదుట కార్మికుల ధర్నా టిడిపి ప్రభుత్వం వందరోజుల పాలనలో ఇసుక విధానంపై మస్కా మాటలతో విసిగిపోయిన కార్మికులు, కూలీలు సిఐటియు ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయనున్నారు. గత మూడు రోజులుగా రిలే దీక్షలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇసుక విధానంలో తికమక పెట్టే చర్యల వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.రీచ్‌లపై టిడిపి నాయకుల గుత్తాధిపత్యం మండలాల్లో స్థానికంగా ఉన్న ఇసుక రీచ్‌లపై టిడిపి నాయకుల గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మాత్రం నిర్మాణ పనులకు ఇసుక తరలించుకుపోతున్నారు. టిడిపి నాయకుల ట్రాక్టర్లతో ఇసుక తరలించినా అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాటుబళ్లతో యథేచ్ఛగా రవాణా చేసుకుంటున్నా ట్రాక్టర్లతో తరలింపుపై ఆంక్షలు విధించడంతో నిర్మాణరంగ పనులు ఊపందుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా జిల్లాలో వేలాది మంది తాపీ మేస్త్రీలు, కార్మికుల, ట్రాక్టర్‌ యజమానులు, కూలీల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి.

➡️