పనులిస్తామని మాటిచ్చి… మాట తప్పారు

Apr 15,2025 21:41

ప్రజాశక్తి – కొమరాడ : తమ గ్రామంలో అభివృద్ధి పనులు ఇస్తామని గత సమావేశంలో మాటిచ్చారని, ఆ హామీని నేటికీ నెరవేర్చలేదని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి శెట్టి శ్యామల అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉదయం 11 గంటలైనా వైసిపి ఎంపిటిసి అభ్యర్థులు పూర్తిస్థాయిలో సమావేశానికి హాజరు కాలేదు. దీంతో సమావేశం నిర్వహించడానికి కోరం లేక వాయిదాపడే సమయంలో టిడిపి ఎంపిటిసి సభ్యులంతా సమాశానికి హాజరవ్వడంతో ఎంపిపి సమావేశానికి కొనసాగించారు. ఇందులో భాగంగా మండల ఇంజనీరింగ్‌ అధికారి రంజిత్‌ ఇటీవల మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పనులు వివరాలను వెల్లడించారు. ఇదే సమయంలో విక్రాంపురం ఎంపిటిసి సభ్యులు దేవకోటి వెంకటనాయుడు మాట్లాడుతూ టిడిపి ఎంపిటిసి సభ్యులకు మండల పరిషత్‌ నుంచి నిధులు కేటా ఇస్తామని చెప్పారు కానీ నేటికీ నిధులు తమకు కేటాయించకపోవడంపై ప్రశ్నించారు. దీంతో ఎంపిపి మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇస్తున్న గోశాలలు, బిసి కార్పొరేషన్‌ రుణాలు కనీసం వైసిపి ప్రజా ప్రతినిధులు కానీ, సర్పంచులకు గానీ చెప్పకుండా టిడిపి నాయకులే చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. టిడిపి ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ తాము ఈ సమావేశానికి రాకపోతే అసలు సమావేశమే జరిగే పరిస్థితి ఉండేది కాదని, మండలాన్ని అభివృద్ధి చేసుకొనేలా కలిసిమెలిసి పనిచేసుకోవాలని వెంకటనాయుడు అన్నారు. అలాగే ఇళ్ల బిల్లుల మంజూరుపై వైసిపి, టిడిపిల మధ్య స్వల్ప వివాదం జరిగింది. అనంతరం ఎంపిడిఒ మల్లికార్జునరావు మాట్లాడుతూ మండలంలో అన్ని రగామాలను అభివృద్ది చేసుకొనేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసుకోవాలన్నారు. డిటి జి.హేమలత మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో చేపట్టిన రీసర్వేలో జరిగిన తప్పిదాలను సరిచేసుకునేందుకు చేపట్టిన వినతుల స్వీకరణలో వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పిటిసి సభ్యులు డి.లక్ష్మి, వైస్‌ ఎంపిపి కె.అన్నపూర్ణ పలువురు మండల శాఖ అధికారులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.బాధ్యత కోసం బరువు అనుకోకుండా పిల్లతో సమావేశానికి గిరిజన వైస్‌ ఎంపిపి గిరిజన ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బాధ్యతగా తీసుకొని బాధ్యత కంటే బరువు గొప్పది కాదని చోళ్ల పదం ఎంపిటిసి సభ్యులు, వైస్‌ ఎంపీపీ కేండ్రుక అన్నపూర్ణ నిరూపించుకున్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు ముందుగానే సమాచారం ఇవ్వడంతో తన రెండున్నరేళ్ల కుమార్తెను ఇంటి వద్ద చూసేవారు ఎవరూ లేకపోవడంతో సమావేశంలో హాజరు కావడం తన బాధ్యత తప్పనిసరి కావడంతో సమావేశానికి కుమార్తెను తీసుకొని సమావేశానికి వచ్చి స్టేజిపై కూర్చొని ఆదర్శంగా నిలిచారు.

➡️