ప్రజాశక్తి – సాలూరురూరల్: గత ప్రభుత్వంలో తీవ్రమైన ఆర్థిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన మాజీ సిఎం జగన్ అమెరికా సంస్థలకు అడ్డంగా దొరికిపోయిన సన్మానం చేయమనడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర గిరిజనశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరులో తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి నాయకులతో నీటి సంఘం ఎన్నికలు గూర్చి శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతులకు మేలు చేసే నీటి సంఘం ఎన్నికలు నిర్వహించలేదని, 2014-19లో టిడిపి ప్రభుత్వం నీటి సంఘం ఎన్నికలు నిర్వహించి రైతులకు మేలు జరిగేలా కృషి చేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం సాగునీటి ప్రాజెక్టులకు షిల్ట్ క్లియరెన్స్ కూడా చేయలేదనీ, సాగునీటి ప్రాజెక్టులకు అంతర్జాతీయ సంస్థలు జైకా నిధులను మంజూరు చేసినా ఆ నిధులను కూడా ఎలా వాడుకోవాలో తెలియని దుస్థితిలో ఉందన్నారు. ఆ నిధులను నిర్వీర్యం చేసిందని, ఎంత సేపు అప్పులు చేసి ప్రజలకు డిబిటి ద్వారా సంక్షేమ పథకాలను అందించేవారమని చెప్పడం తప్ప రాష్ట్రంలో బూతద్దం పెట్టి చూసిన అభివృద్ధి అన్న పదం ఎక్కడా కనిపించలేదని ఎద్దేవా చేశారు. తన జల్సాల కోసం రూ.5850 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కార్యకర్తల ంతా సమిష్టిగా ఉండి గ్రామాల్లో సాగునీటిని సక్రమంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందని అన్నారు. రైతులకు మేలుచేసే ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పనులు చేయాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజుదేవ్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకో లేదని విమర్శించారు. ప్రస్తుతం జరగనున్న నీటి సంఘాలన్నీ ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిం చాలని కోరారు. కార్యక్రమం లో సాలూరు పట్టణ, మక్కువ, మెంటాడ, పాచిపెంట మండలాలు టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, అముదాల పరమేశ్, గుళ్ల వేణుగోపాలనాయుడు, చలుమూరి వెంకటరావు, పిన్నింటి ప్రసాద్ బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.