పుర’పాలన’ అస్తవ్యస్తం

Mar 11,2025 21:14

ప్రజాశక్తి – సాలూరు : స్థానిక పురపాలక సంఘంలో ఆలనాపాలనా లేని పరిపాలన కొనసాగుతోంది. వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. వేటగాడు మెత్తనెతే లేడి ఎన్ని గంతులైనా వేస్తుందన్న చందంగా ఉంది పురపాలక సంఘం తీరు. గత ఏడు నెలలుగా అభివృద్ధి మూడు అడుగుల ముందుకు, ఆరు అడుగుల వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడడంతో మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సోమవారం నుంచి కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో వున్నారు. ప్రతినెలా జీతం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కాంట్రాక్టు కార్మికుల జీతాలకు సరిపడే స్థాయిలో పన్నులు వసూలు జరగడం లేదు. దీంతో కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సమ్మె కారణంగా పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది. రెండు రోజులుగా పట్టణంలో చెత్తలు పేరుకుపోతున్నాయి.సమర్ధుడైన కమిషనర్‌ లేక గత ఏడు నెలలుగా మున్సిపాలిటీకి సమర్ధుడైన కమిషనర్‌ కొరత వెంటాడుతోంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన కమిషనర్‌ ప్రేమప్రసన్నవాణి బదిలీ అయిన తర్వాత కమిషనర్‌గా సిహెచ్‌.సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. వాస్తవంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దృష్టి లోపం, స్వతంత్రంగా నిలబడలేని పరిస్థితి ఆయనకు ఉంది. కమిషనర్‌ పోస్ట్‌ మున్సిపాలిటీకి గుండెకాయ లాందిది. ప్రతి రోజూ వార్డుల్లో తిరిగి పారిశుధ్య పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అభివృద్ది పనులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంది. పట్టణ ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన బాధ్యత ఆయనపై ప్రధానంగా వుంది. పారిశుధ్య కార్మికుల జీతాలకు ఇబ్బంది లేకుండా ఆస్తి, నీటి పన్నుల వసూళ్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మరో వైపు ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాలకు పూర్తి సమాచారంతో హాజరు కావాల్సి ఉంటుంది. కమిషనర్‌గా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన ఈ పనులేవీ సక్రమంగా జరగలేదు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాల్లో నివేదించాల్సి పరిస్థితిలో ఇప్పుడు కమిషనర్‌ లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆయన పట్ల అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మున్సిపల్‌ డైరెక్టర్‌, రీజినల్‌ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌ ల్లో సాలూరు మున్సిపాలిటీ తరపున నివేదించాల్సిన పరిస్థితిలో కమిషనర్‌ లేకపోవడంతో ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టు సాధించని చైర్‌ పర్సన్‌ పువ్వులమున్సిపాలిటీ పీఠంపై చైర్‌పర్సన్‌గా పువ్వుల ఈశ్వరమ్మ ఆసీనులై నాలుగేళ్లు గడిచాయి. అయినా ఆమె మున్సిపాలిటీపై ఇంకా పట్టు సాధించని పరిస్థితి కనిపిస్తోంది. ఆమె భర్త పువ్వుల నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా పురపాలనను సమర్ధవంతంగా నడిపించే పరిస్థితి లేకపోయింది. వైసిపి కౌన్సిలర్లతో సమన్వయం లేని కారణంగా ఆమె కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత పది నెలలుగా టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మున్సిపల్‌ అధికారులు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తున్న తీరు కనిపిస్తోంది.మంత్రి ఇలాకాలో పూర్‌ పాలనటిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తోంది. ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా ఉన్న సంధ్యారాణి తన సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీ అభివృద్ధి దృష్టి సారిస్తారని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడు నెలల క్రితం మున్సిపల్‌ కమిషనర్‌గా సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పరిస్థితిని చూసి మంత్రి అవాక్కయ్యారు. అస్తవ్యస్తంగా వున్న మున్సిపాలిటీకి ఇలాంటి కమిషనర్‌ని ఎలా నియమిస్తారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన్ను సరెండర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ కమిషనర్‌ మార్పు గురించి ఆమె పట్టించుకున్న దాఖలాల్లేవు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు వారికి కావాల్సిన అధికారులను కమిషనర్లుగా తెచ్చుకున్న పరిస్థితి వుంది. నియోజకవర్గంలో నాలుగు మండలాలకు అవసరమైన, సమర్ధులైన తహశీల్దార్లు, ఎంపిడిఒలను మంత్రి నియమించుకున్నారు. కానీ మున్సిపాలిటీ విషయంలో తనకు పట్టనట్లు వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది. పురపాలన అస్తవ్యస్తంగా మారుతున్నా ఆమె చూసీచూడనట్లు వ్యవహరించడంపై పట్టణ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

➡️