ప్రజాశక్తి -బలిజిపేట: మండలంలోని నారాయణపురంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సమస్యలు తాండవిస్తున్నాయని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గేదెల సత్యనారాయణ, సిపిఎం నాయకులు దన్నాన త్రినాధ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గ్రామంలో గురువారం పర్యటించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో చెత్తపేరుకుపోవడంతో రోడ్లపై వెళ్తుంటే కంపు కొడుతుందని, కాలువల్లో మరుగు పేరుకుపోయిందని వాపోయారు. పంచాయతీకి నిధులు వస్తున్నా గ్రామాభివృద్ధికి పైసా ఖర్చు పెట్టని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే గ్రామాభివృద్ధిని పంచాయతీ సెక్రెటరీ పట్టించుకోవడంలేదని, అయినా సర్పంచులు, వార్డుసభ్యులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కాలువల్లో చెత్త తొలగించకపోవడంతో ప్రజలు దోమల బారినపడి రోగులకు గురవుతున్నారు. ఒకపక్క ప్రభుత్వం దోమలపై దండయాత్ర చేసి దోమలు లేని గ్రామాన్ని ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని చూస్తున్నా ఇక్కడ అందుకు భిన్నంగా ఉందన్నారు. తక్షణమే కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తను తొలగించాలి, నీటి కుళాయిలకు ట్యాపులు బిగించాలి గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు యమ్మల మన్మధరావు, వెంకట్రావు నాయుడు గ్రామస్తులు పాల్గొన్నారు.
