ప్రజాశక్తి- పాచిపెంట: నవధాన్యాల సాగు నేలతల్లి బాగు కోసమే అని భూ సారాన్ని పెంచే ఒక కొత్త శాస్త్రం ఈ నవధాన్యాల సాగు అని ప్రకృతి సేద్య రీజనల్ ట్రైనింగ్ అధికారి కె. ప్రకాష్ అన్నారు. వ్యవసాయాధికారి కె.తిరుపతిరావుతో కలిసి కొత్తవలస గ్రామంలో ఉన్న కొటికిపెంట రైతు సేవా కేంద్రంలో నవధాన్యాల మిశ్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవధాన్యాలను సాగు చేసి భూమిలో కలియదున్నటం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. మామూలు పచ్చిరొట్ట విత్తనాలతో పోలిస్తే నవధాన్యాల సాగు ఒక సరికొత్త శాస్త్రం అని తెలిపారు. ఆకు పచ్చని మొక్కలు అన్నీ కిరణాలు సన్యాసయ్యాక క్రియ అనే ప్రక్రియ ద్వారా స్వయం పోషకాలుగా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయని ఇలా తయారు చేసుకున్న శక్తిని వేరు వ్యవస్థలు భూమిలోనికి కొంత భాగాన్ని విడిచిపెడతాయని చెప్పారు. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఈ శక్తిని గ్రహించి పంట తీసుకోలేని స్థితిలో ఉన్న మూలకాలను పంటల వేరు వ్యవస్థలు గ్రహించగలిగే స్థితిలోనికి మార్చి పంటకు అందించడం ద్వారా ఎలాంటి పోషక లోపాలు లేని పంటలు పండించవచ్చని భూమిలో జీవ వైవిధ్యం పెంచడం ద్వారా ఇది సాధ్యమని తెలిపారు. రకరకాల వేరు వ్యవస్థలు భూమిలో ఉండి అనేక రకాల సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతాయని తద్వారా భూమిలో జీవ వైవిధ్యం పెరిగి మృత్తిక మెరుగుపడి నీటిని పోషకాలను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని కలుపు ఉధృతి తగ్గుముఖం పట్టి ఎండకు గాలికి వర్షానికి సారవంతమైన మట్టి నష్టపోకుండా చేసి భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడమే ఈ పిఎండిఎస్ నవధాన్యాల సాగు ప్రాముఖ్యత అని తెలిపారు. రైతులందరూ ప్రస్తుతం పడుతున్న వర్షాలకు దుక్కి దున్ని నవధాన్యాలు వేసి మే నెలాఖరులోగా ఎలాంటి పంటలనైనా వేసుకోవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మాపురం క్లస్టర్ ఇన్చార్జ్ కర్రీ శ్రీనివాసరావు, గురువినాయుడుపేట క్లస్టర్ ఇన్చార్జ్ సూర్యారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాచిపెంట లక్ష్మణ్, ఎల్‌టు సురేష్, రైతులు పాల్గొన్నారు.
