ఘనంగా వడ్డే ఓబన్న జయంతి

Jan 11,2025 21:16

ప్రజాశక్తి – పార్వతీపురం : స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా జరిగింది. కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఓబన్న చిత్రపటానికి పూలమాలను వేసి, జ్యోతిప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డె ఓబన్న 1870 జనవరి 11న నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సం గ్రామంలో వడ్డె సుబ్బన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించారన్నారు. ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారని, రైతులపై అధిక పన్నులు విధించడం వల్ల బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం చేసే పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఓబన్న పేద రైతులు, గ్రామస్తుల హక్కులను కాపాడ్డానికి, వారికి న్యాయం చేయాలని బ్రిటీష్‌ వారిని పతిఘటించేందుకు తన ప్రాణాలను కూడా త్యాగం చేశారని గుర్తుచేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుసాగాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.హేమలత, కె.అర్‌.సి ప్రత్యేక ఉపకలెక్టర్‌ పి.ధర్మచందర్‌ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్‌, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్‌.కృష్ణ, ఎఫ్‌ సెక్షన్‌ పర్యవేక్షకులు జి.శ్రీరామ్మూర్తి, వడ్డే కుల అధ్యక్షులు కె.శంకరరావు ఇతరులు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలు స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్‌పి దిలీప్‌కిరణ్‌ ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో, సైన్యాధ్యక్షుడిగా ఓబన్న పోషించిన తీరు వీరోచితమని, భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని, సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం, కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు ఓబన్న అని గుర్తు చేశారు. ఓబన్న పేద రైతులు, గ్రామస్తుల హక్కులను కాపాడ్డానికి, వారికి న్యాయం చేయాలని, బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ప్రతిఘటించేందుకు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని గుర్తుచేశారు. ప్రతీ ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, వారి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఆర్‌ ఆర్‌ఐ నాయుడు, రాంబాబు, ఆర్‌ఎస్‌ఐ లు, ఎస్బీ ఎస్సై లు, ఎస్బి,డిసిఆర్బి , ఎస్‌టిఎఫ్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️