ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని శంబరలో చేపడుతున్న అభివృద్ధి పనులకు స్వల్ప అడ్డంకులు ఏర్పడుతుండడంతో పనులు వేగవంతానికి ఒకంత అడ్డంకులుగా మారాయని చెప్పడంలో సందేహం లేదు. సుమారు రూ.50 లక్షలతో సిరిమాను తిరిగే ప్రధాన రహదారులు అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. అలాగే పోలమాంబ ఆలయాల ఆవరణలోతో కలిపి సిసి రోడ్ల నిర్మాణానికి రెండు కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. పండగ సమయం సమీపం కావస్తుండడంతో పనులు వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నారు. పంచాయతీరాజ్ డిఇ ఆదేశాల మేరకు ఎఇ రజిత పనులు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వనం గుడి రహదారు పనులు 70 శాతం పూర్తి కాగా మిగిలిన ప్రధాన రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. ఇక్కడ సిసి రోడ్డు నిర్మాణం మధ్యలో విద్యుత్ స్తంభాలు ఉండడంతో రహదారి నిర్మాణం చేసినా ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. సిసి రోడ్డు నిర్మాణానికి ముందే విద్యుత్ స్తంభాలు రహదారి మధ్యలో లేకుండా పక్కకు మార్చాలని జెడ్‌పిటిసి ఎం.శ్రీనివాసరావు అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గోముఖి నది పరివాహ ప్రాంతంలో రాతికట్టు నిర్మాణం పనులు చకచక జరుగుతున్నాయి. నడిమి వీధిలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు కొంత అడ్డంకిగా మారిన స్థలాలకు సంబంధించి ఆయా ఇళ్ల యజమానులతో గ్రామ పెద్దలంతా కలిసి అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరే ఆస్కారం ఉంది. సుమారు మూడు అడుగులు మేర ఇరువైపులా స్థలాలు ఇచ్చేందుకు అంగీకరిస్తే రహదారి అభివృద్ధి పనులు ముందుకు సాగి అన్ని విధాలా వాహనాల రాకపోకలకు, సిరిమాను తిరిగేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.