ప్రజాశక్తి – పాలకొండ : నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక విషయం ఒక కొలిక్కి రావడం లేదు. పంతం కోసం ప్రతిపక్షం పట్టుబడగా, ప్రతిష్ట కోసం అధికార పార్టీ పాకలాడడంతో ఆఖరుకు చైర్మన్ ఎన్నిక మంగళవారం కూడా వాయిదా పడింది. ఎస్సీ రిజర్వుడ్ కేటాయించిన చైర్మన్ పదవికి వైసిపి తరపున గెలిచిన రెండో వార్డ్ కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరికి వరిస్తుందని అందరూ భావించారు ఈనెల 3న సబ్‌కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నిక జరగ్గా ఇటీవల టిడిపిలో చేరిన మల్లేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడంతో వైసిపి అందుకు వ్యతిరేకించింది. అప్పటికే పార్టీ నుంచి బి-ఫారం కూడా ఎన్నికల అధికారికి అందాయి. దీంతో కూటమి నేతలకు వైసిపి శ్రేణులకు మధ్య సయోధ్య కుదరలేదు. అధికారంలో తమున్నామని, ఎలాగైనా తమ పార్టీ చైర్మన్‌గా చెప్పుకోవడానికి కూటమి నేతలు ప్రయత్నించారు. తమ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని అలాగే నగర పంచాయతీలో సంఖ్యాబలం కూడా తమకే ఉన్నందున పట్టు వదలకుండా ఉండేందుకు వైసిపి పట్టు పట్టింది. దీంతో ఇరుపార్టీలు పంతానికి పోవడంతో చైర్మన్ ఎన్నిక జరగలేదు. ఇరు పార్టీ పెద్దల దృష్టి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికపై పడింది. ఇటు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, అటు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పెద్దలు కూడా దష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎలాగైనా ఎన్నిక జరిపి చైర్మన్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఇద్దరు మంత్రులు మంగళవారం ఫోన్ ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. మరో మంత్రి ఏకంగా రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి అనుకున్నది సాధించాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అలాగే వైసిపి రాష్ట్ర నాయకులు, విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నేరుగా వైసిపి కౌన్సిలర్లుతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మంగళవారం సమావేశానికి వైసిపి కౌన్సిలర్లు ఎవరూ హాజరు కావద్దని చెప్పినట్లు తెలుస్తుంది. వైస్ చైర్మన్-2 పల్లా ప్రతాప్‌ను డిసెంబర్‌లో చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఎన్నికల వాయిదా పడడంతో మళ్లీ ఆయనే కొనసాగునున్నారు.
