ప్రజాశక్తి – కురుపాం : ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిశిఖర గ్రామాల్లో సురక్షిత తాగునీరు కల్పిస్తున్నట్లు ప్రభుత్వాలు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో అమలు కాలేదు. అనేక మారుమూల పివిటిజి గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో గిరిజన ప్రజలకు సమీప గెడ్డలు, ఊటబావే శరణ్యంగా మారాయి. కలుషితమైన నీటిని గిరిజన ప్రజలు తాగి పలురకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. మండలంలోని తిత్తిరి పంచాయతీలో గల గుండం, ఎగువ గుండం, తులసి తదితర గిరి శిఖర పివిటిజి గ్రామాల్లో ఇప్పటి వరకు తాగునీటి సౌకర్యం కల్పించలేదు. సుమారు 60 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు తాగునీటి బోరు గాని గ్రావిటీలు నిర్మించలేదు. తాగునీటి సదుపాయం లేక తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామానికి సమీపంలోని ఉన్న గెడ్డలు, ఊటబావులను ఆశ్రయించి కలుషిత నీటిని తాగడానికి ఉపయోగిస్తున్నారు. కలుషితమైన నీరు తాగడం వల్ల ఆయా గ్రామాల్లోని గిరిజనులు టైఫాయిడ్, పచ్చకామెర్లు, కడుపునొప్పి వంటి వ్యాధులకు నిరంతరం గురవుతున్నారు. రానున్న వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రతకు ఊటగెడ్డ నీరు కూడా ఇంకిపోయే పరిస్థితులు ఉన్నందు గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా చర్యలు తీసుకునే దాఖాలాల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత, ప్రస్తుత పాలక ప్రభుత్వాలు తాగునీటి సమస్యపై దృష్టి సారించలేదు. రానున్న వేసవిలో నేపథ్యంలో ముందస్తుగా కూటమి ప్రభుత్వంలోనైనా పాలకులు, అధికారులు స్పందించి గ్రామాల్లో గ్రావిటీ పథకం నిర్మించి సురక్షితమైన తాగునీరందించాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు.
