ప్రజాశక్తి-పార్వతీపురం : ఈ నెల 8 నుంచి జిల్లాలో ప్రారంభమైన పి-4 సర్వేను ( పబ్లిక్, ప్రయివేట్, పీపుల్ పార్టనర్‌షిప్ ) పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2.65 లక్షల గృహాలకు సర్వే చేయాల్సి ఉందని చెప్పారు. ప్రతి అధికారి పక్కా ప్రణాళికతో ప్రతి రోజూ సర్వే చేయాలన్నారు. పి-4 సర్వేపై ఇప్పటికే శిక్షణ నిర్వహించినందున, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా జాగ్రత్తగా చేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలు వారి వృత్తుల రీత్యా ఉదయమే బయటకు వెళ్ళి, సాయంత్రం తిరిగి వచ్చే అవకాశం ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇళ్లు పేదరికాన్ని అధిగమించి, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వారి సహకారంతో అట్టడుగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీస సౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ విధానం అవలంభించనుందని చెప్పారు. ప్రజలు అందుబాటులో ఉండే సమయంలో ఒక్కొక్కరూ రోజుకు కనీసం 90 వరకు సర్వేలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను ఇప్పటినుంచే తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఎంపిడిఒ, కమిషనర్ వారి పరిధిలోని నీటి కొళాయిలు, బోర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలు ఉన్న చోట తక్షణమే పరిష్కరించాలని స్పష్టంచేశారు. నీటిఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే బోర్లు వేయడం, మరమ్మతులు చేపట్టాలన్నారు. పురపాలక పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీలకు కూడా తాగునీటి సరఫరా కావాలని వివరించారు. ప్రతీ వారం తాగునీటి పరీక్షలు చేసి, రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఒలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
