సాంప్రదాయ పంటలే కాకుండా వాణిజ్యపంటలపై మొగ్గు చూపాలని, వాణిజ్యపంటల సాగుతో రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని అధికారులు అవగాహన కల్పించారు. అధికారుల సూచనలతో వాణిజ్య పంటల సాగుపై రైతులు మొగ్గు చూపారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయం కల్పించడంలో అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు నష్టాల బారినపడుతున్నారు. అలాంటిదే పామాయిల్ రైతుల పరిస్థితి.
ప్రజాశక్తి – సాలూరురూరల్: పామాయిల్ సాగు లాభదాయకంగా ఉంటుందని ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు ఈ పంట సాగుకు ముందుకొచ్చారు. అయితే రాను రానూ దీని రేటు చాలా దారుణంగా పడిపోవడంతో రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మండలంలో సుమారు 5వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఈ ప్రాంతంలో ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఈ పంటను మొదట పండించడంతో అది లాభదాయకంగా ఉండడంతో ఈ ప్రాంత రైతులు కూడా ఆ పంటను సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పామాయిల్ పంట ధరలు పతనంతో కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్ల క్రిందట విదేశాల నుంచి దిగుమతులు లేకపోవడంతో ఇక్కడ ధరలు పెరిగాయి. ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రైతులు ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. సాలూరు మండలంలో మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉన్న మామిడిపల్లి, కందులపదం, అన్నంరాజు వలస, తోనాం, కురుకుట్టి, తుండ, మావిడి, కొట్టు పరువు, మరిపల్లి ప్రాంతాల్లో అధికంగా ఈ పంట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ పంట వేసిన నాలుగేళ్లు ఎటువంటి దిగుబడి రాదు. అప్పుడు దీని మీద ఎరువులు, కలుపుతీతకు ఖర్చులు భారీగానే పెట్టాల్సి వస్తుందని, ఆ తర్వాత 40ఏళ్ల వరకు ఇక మొక్కను తీయకుండా దాని మీద వచ్చే పంటను అమ్ముకోవచ్చుననే ఆశతో ఈ పంట మీద రైతులు ఎక్కువగా వేయడానికి మొగ్గు చూపుతున్నారు. కరోనా సమయంలో టన్ను సుమారు రూ.23వేలు ధర పలకడంతో ఈ ప్రాంతంలో 3,4 ఎకరాలు ఉన్న రైతులు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చిన సమయానికి టన్ను రూ.12 వేలు నుంచి రూ.13వేలకు పడిపోవడంతో చాలా నష్టపోతున్నారు. ఒకసారి ఆ మొక్క నాటిన తర్వాత దాన్ని తీసి మరో పంటను వేసుకోవడానికి వీలుపడదు. దీంతో ఉన్న పంట సాగు చేయలేక, వాటిని తీయలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదేళ్ల కిందట మొక్కలను వేయడానికి, వాటి పెట్టుబడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం కింద ఏడాదికి కొంత నగదు ఇచ్చేది. అయితే గత ప్రభుత్వం పూర్తిగా పట్టుబడి సాయం ఇవ్వలేదు. దీంతో మొక్కలను ఒక్కొక్క రూ.250 పెట్టి కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ఎకరాకు సుమారు రూ.30వేలు నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎకరాకు 4,5టన్నులు పంట వస్తుందని ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నట్లు సొంత భూమి ఉన్న వారి పరిస్థితి ఇలా ఉంటే కౌలుకు తీసుకున్నవారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పామాయిల్ సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా, విదేశాల నుంచి దిగుమతులు తగ్గించినట్లైతే రైతులు నష్టాల బారి నుంచి బయట పడతారు. ప్రధాన పంటల్లో అంతర్ పంటగా కొన్ని సాగు చేద్దామన్నా అసలు పంట దిగుబడి వస్తుందో రాదోనన్న భయం రైతులను వెంటాడుతుంది.పామాయిల్ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలిసాంప్రదాయ వ్యవసాయం చేసినట్లయితే పెట్టుబడులు అధికమని, కూలీలు కూడా ఎక్కువ మంది అవసరమవుతారని, లాభాలు కూడా రావనే ఉద్దేశ్యంతో ఈ పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం. తీరా ఇప్పుడు ఈ పంట సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టపోతున్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లు ఇక్కడ కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు కొంత పెట్టుబడి సాయం చేయాలి.పద్మాల సురేష్,పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, తోణాం.ప్రభుత్వం స్పందించాలినేను 8 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నాను. పంట వేసి 8 ఏళ్లు అవుతుంది. ఈ 8ఏళ్లలో నాలుగేళ్లు మొక్క పెరిగే వరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. మిగిలిన నాలుగేళ్లు పంట మీద కొంత ఆదాయం వస్తుంది. కరోనా సమయంలో వచ్చిన ధరను ఎప్పుడు చూడలేదు. అప్పుడే కొంత ఆదాయాన్ని చూశాం. ఇప్పుడు మాత్రం నష్టాలు చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పామాయిల్ దిగుమతులు చేయడంతో నష్టపోతున్నాం. ఇలాగే ప్రభుత్వం వ్యవహిరించినట్లైతే ఈ వ్యవసాయాన్ని వదులుకోవాల్సిందే.హరి వెంకటరమణ,రైతు, మామిడిపల్లి.