ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లాలో ప్లాస్టిక్ ను, చెత్తను పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్‌రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పలు అంశాలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, పంచాయతీల్లో దీనిపై ఒక తీర్మానం చేసి అమలు చేయాలని అన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యతులో పేపర్, క్లాత్ బ్యాగులను ప్రోత్సహించాలని, ఇందుకు స్వయం సహాయక బృందాలను వినియోగించుకోవాలని కలెక్టర్ వివరించారు. ప్లాస్టిక్ రహిత పార్వతీపురం జిల్లాలో భాగంగా తీర్మానం అమలైన తర్వాత ఎవరైన ప్లాస్టిక్ వినియోగిస్తే, వారిపై జరిమానా విధిస్తామని కలెక్టర్ తేల్చి చెప్పారు. రోడ్లపై ఎక్కడా ప్లాస్టిక్, చెత్త కనిపించరాదని, ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకొని అడుగులు వేయాలని కలెక్టర్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను అమల్లోకి తీసుకువచ్చిందని, వాట్సాప్ ద్వారా మనకు కావలసిన అన్ని రకాల సేవలను పొందవచ్చని కలెక్టర్ వివరించారు. ఈ విషయాన్ని డిజిటల్ అసిస్టెంట్లు తమ గ్రామాల్లోని ప్రజలకు వివరించి, వారు వాట్సాప్ ద్వారా సేవలు పొందేలా చైతన్యపరచాలని ఆదేశించారు. ఇకపై జిల్లా అధికారులు ప్రతి మంగళ, శుక్రవారాలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అక్కడ పీ4 కింద జరుగుతున్న సర్వే వివరాలను తెలుసుకోవాలని అన్నారు. ఈ సర్వే ఈ నెల 15 నాటికి పూర్తికావాలని తేల్చిచెప్పారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 30 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన 70 శాతం సర్వే ఈ వారం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలన వంటి తదితర అంశాలపై పటిష్ట చర్యలు చేపట్టేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో ఈగల్ యూత్ క్లబ్బులను ఏర్పాటుచేయాలని కలెక్టర్ చెప్పారు. వీరంతా ఆయా గ్రామాల్లో నాటుసారా,గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం, బాల్యవివాహాల నిషేధం, రహదారి భద్రతా తదితర అంశాలపై ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తారని వివరించారు. 45 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లగా పరిగణిస్తుందన్నారు. అలాగే 35 మంది కన్నా తక్కువగా ఉండే పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూళ్లగా పరిగణిస్తూ ఇద్దరు టీచర్లను మాత్రమే ప్రభుత్వం నియమిస్తుందని, తద్వారా అన్ని తరగతులను ఆయా ఉపాధ్యాయులే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థి అపార్ట్ ఐడీ ఆధారంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నదీ, లేనిదీ పరిశీలించి, వివరాలు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీవాస్తవ, ఇంచార్జి జెసి కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.అందరి భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధిజిల్లాను అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేసారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పి-4, నియోజకవర్గ విజన్‌పై జిల్లా అధికారులు, స్వచ్ఛంధ సంస్థలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్ కింద పీ 4 విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. నియోజక వర్గాల విజన్‌లో భాగంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై స్వచ్చంధ, ఇతర పలు సంస్థల అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో సిపిఒ పి.వీర్రాజు, ఉమ్మడి జిల్లా పరిషత్ సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా వ్యవసాయ, పశు సంవర్ధక, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారులు కె.రాబర్ట్ పాల్, ఎస్. మన్మధరావు, ఒ.ప్రభాకరరావు, డ్వామా, ఐసిడిఎస్ పీడీలు కె.రామచంద్రరావు, టి.కనకదుర్గ, బీసీ సంక్షేమ అధికారి ఎస్.కృష్ణ, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.వి.కరుణాకర్, వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్. భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
