ప్రజాశక్తి – సీతానగరం : బకాయి పడ్డ ఉపాధి బిల్లులు తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని నిడగల్లు గ్రామ సచివాలయం వద్ద గురువారం ఉపాధి వేతనదారులతో కలిసి బకాయి బిల్లులు చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ గత తొమ్మిది వారాలు వేతనదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు అర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంతా కష్టపడి పనిచేసినా కూలి రాకపోవడంతో జీవనం దైన్యంగా మారిందన్నారు. ఇప్పటికే దొరికనచోట అప్పులు చేశారని, ఇప్పుడు ఆ అప్పులు కూడా ఇచ్చేవారు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలా మండలంలోని 35 పంచాయతీల్లో గల వేతనదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పని ప్రదేశంలో కనీస సదుపాయాలైన తాగునీరు, టెంట్లు, మజ్జిగ, వైద్యం కిట్లు లేవంటున్నారు. తక్షణం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిడగల్లు పంచాయతీ కార్యదర్శికి వినితి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధి వేతనదారులు త్రినాధ, అడవిరాముడు, జానకి, భాస్కరరావు, రాము తదితరులు పాల్గొన్నారు.
