జిల్లాలో వరి కోతలు పూర్తయి, నూర్పులు కొనసాగించి ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రయత్నంలో ఉండగా అకస్మాత్తుగా ఏర్పడిన బంగాళా ఖాతంలో ఏర్పడిన పెంగల్ తుపాను అన్నదాత గుండెల్లో అలజడి రేపింది. తుపాను కారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా చినుకులు కురవడంతో పంటను కాపాడుకొనేందుకు రైతులు నానా అవస్థలుపడుతున్నారు.
ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్: పార్వతీపురం, పాలకొండ డివిజన్లోని పలు గ్రామాల్లో రైతులు కోసిన పంటను పొలాల్లో కుప్పలుగా వేసుకొనేందుకు, నూర్పులు సాగించిన ధాన్యం తడవకుండా చూసేందుకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈలోగా రైతులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, కళ్లాల్లో ఉండే ధాన్యాన్ని వెంటనే బస్తాల్లో నింపుకొని ఇళ్లు, మిల్లుల వద్ద భద్రపరచుకోవాలని సూచించారు. ధాన్యం తడవకుండా చూడాలని, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అయినా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఈ తుఫానుపై ఎలాంటి ముందస్తు సూచనలు రైతులకు చేయకపోవడంతో తమ ధాన్యాన్ని కళ్లాల్లోనే ఉంచుకునే పరిస్థితి ఏర్పడింది. అల్పపీడనం రానున్న రోజుల్లో తీవ్రమైతే రైతులు ఏ విధంగా తమ పంటను సంరక్షించుకోవాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం కోసం టార్పాలిన్ సరఫరా చేయలేదు. దీంతో పంటను కాపాడుకునేందుకు కనీసం ప్లాస్టిక్ పరదాలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జిల్లాలో లక్షా75, 454 ఎకరాల్లో వరి సాగైంది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో మిల్లర్లతో ఏర్పడిన సమస్య వల్ల జాప్యం జరిగింది. దీంతో రైతులు పండిన పంటను నూర్పిడి చేయడానికి పెద్దగా ఆసక్తి చూపకుండా కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూశారు. తీరా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న సమయంలో ఈ అకాల వర్షాల వల్ల తాము ఎక్కడ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందో, ఆరుగాలం పండించిన పంట చేతికి దక్కుతుందో లేదో అని మధనపడుతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగపర్చి కళ్లాలోని ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.వీరఘట్టం : తుఫాన్ ప్రభావంతో శుక్రవారం సాయంత్రం వర్షం కురవడంతో వరి కుప్పలు, ఓవులు తడిసి ముద్దయ్యాయి. గత రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో కొంతమంది అన్నదాతలు కోసిన పంటను వరికుప్పలు వేసుకోవడం, మరి కొంతమంది నాటుబళ్లతో నేరుగా కళ్లాలకు తరలించారు. మరికొన్ని చోట్ల ఓవులు తడిసి ముద్దాయి.పాలకొండ : తుఫాన్ కారణంగా పాలకొండ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మండలంలో బాసురు, కోటిపల్లి, రాజుపేట తదితర ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందారు. శనివారం కూడా ఇలాగే వర్షం పడితే తమ పరిస్థితి ఆగమ్యాగోచారం అవుతుందని తీవ్ర ఆందోళన పడుతున్నారు.కురుపాం : మండల కేంద్రంతో పాటు పరిసర గిరిజన గ్రామాల్లో శుక్రవారం రాత్రి చిరుజల్లులు కురుస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా తుఫాను రూపంలో వర్షాలు పడడంతో ధాన్యం పాడై మొక్క మొలుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు మదుపులు పెట్టి తీరా పంట చేతికి వచ్చిందన్న సమయంలో ఇలా తుఫాను రూపంలో ముంచేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మక్కువ : తుఫాను ప్రభావంతో శుక్రవారం సాయంత్రం ముసురు ప్రారంభమైంది. ఈనెల 27న తుఫాను వస్తుందన్న ముందస్తు ప్రకటనను రైతులు తెలుసుకున్నా తుఫాను జాడలు లేకపోవడంతో గురువారం నుంచే వరి చేను కోతలు మొదలెట్టారు. అయితే ప్రస్తుత శుక్రవారం వర్షం పడడంతో వరి చేను పూర్తిగా తడిసి ముద్దవుతుంది.